Friday, February 7, 2025

కేసీఆర్ టార్గెట్ గా….
రేవంత్ వ్యూహం

గులాబీదండులో గుబులు

(‘రిపబ్లిక్ హిందూస్థాన్’ కోసం అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009, ప్రత్యేక కథనం)

'రైతుబంధు'ను ఎరగా పెట్టి ఓటింగ్ లక్ష్యంతో ముందుకెళుతున్న కేసీఆర్ ను ఆదే రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి పక్కాగా ముందుకెళ్ళాలని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా రైతుల కోసం కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. కేసీఆర్ టార్గెట్ గా సరికొత్త వ్యూహానికి పదును పెట్టింది. సీఎంకు రైతుల మీద ప్రేమ ఉంటే ధాన్యం కొనుగోలు విషయంలో మోడీపై ఒత్తిడి తెచ్చేందుకు… అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తోంది.

లోపాయకారి ఒప్పందం గురించి..:
వారం రోజులు అక్కడే ఉండి మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలిసిన కేసీఆర్.. కేంద్రం ధాన్యం కొననని చెప్పిందని అనడం వారి లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమని అంటోంది. ధాన్యం కొనుగోలు విషయంలో మోడీ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తోందని సీఎం నిజంగా భావిస్తే స్వయంగా తానే నాయకత్వం వహించి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని చెబుతోంది. ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతూ డ్రామాలు ఆడడం కాకుండా కేంద్రంపై చిత్తశుద్ధితో కేసీఆర్ ఒత్తిడి తేవాలని.. అందుకు తాము సహకరిస్తామని అంటోంది. తన వ్యక్తిగత స్వార్ధం కోసం మోడీ దగ్గర కేసీఆర్ మోకరిల్లుతూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తోంది.

అవినీతిని ఎండగడుతూ..:
కాళేశ్వరం, మిషన్ భగీరథలతోపాటు ఇతర ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోడానికి మోడీ, అమిత్ షాల దగ్గర రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని ఆరోపిస్తోంది. కేసీఆర్ ఢిల్లీలో వారం రోజుల పాటు ఉండి అకౌంట్స్ సెటిల్ చేసుకున్నారు తప్ప.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమో, విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని సాధించుకునేందుకో మాత్రం కాదని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.

ఫ్లైట్ దిగగానే మళ్ళీ షురూ..:
హైదరాబాద్ లో దిగగానే ‘కేంద్రం ధాన్యం కొనుగోలు చేయని విషయం గుర్తుకు వచ్చిందా..? ఢిల్లీలో ఉన్నప్పుడు తెలియ లేదా.?’ అని నిలదీస్తున్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ఆందోళన చేసిన టీఆర్ఎస్ నాయకులు.. మోడీ దగ్గరకు వెళ్లినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. మనకు రావాల్సిన ఫ్యాక్టరీని కేంద్రం లాతూర్ కు తీసుకెళుతుంటే కేసీఆర్ ఎందుకు నిలదీయలేదని అడుగుతున్నారు. అలాగే ఐటీఐఆర్ ఇవ్వకుండా కేంద్రం మొండిచేయి చూపిస్తుంటే దరఖాస్తు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప గట్టిగా కొట్లాడడం లేదని విమర్శిస్తున్నారు.

జాతీయ హోదా ఎక్కడ.?:
ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కి కూడా జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే.. కేసీఆర్ మౌనముద్ర దాల్చారేగానీ.. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాత్రం అనిపించలేదంటూ మండిపడుతున్నారు.

సిబిఐ ఫిర్యాదుల మేనేజ్..?:
తనపై ఉన్న సీబీఐ కేసులు బయటకు రాకుండా, తన ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు మోడీతో కేసీఆర్ చేతులు కలిపి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

గెజిట్ పై మౌనమేల..?:
మోడీ సర్కార్ రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆనాడు హడావుడి చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సాగునీటి ప్రాజెక్టులను తన స్వాధీనంలోకి తీసుకుంటూ గెజిట్ తెస్తే సైలెంట్ గా ఉండిపోయారే తప్ప కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదని గుర్తు చేస్తున్నారు. విద్యుత్ సవరణ చట్టంపై అధికారులతో మాట్లాడిస్తున్నారే గానీ.. కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారని.. అలాగే వ్యవసాయ చట్టాలపై యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను మోడీ సర్కార్ అమ్మడంపై యుద్ధం చేస్తానని.. గ్రేటర్ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించారు.. కానీ.. ఆ తర్వాత దాని ఊసే లేదని విమర్శిస్తున్నారు. సీఎం తీరు చూస్తుంటే మోడీ, అమిత్ షాకు తెలంగాణ హక్కులను, ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్లే కనిపిస్తోందని అంటున్నారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ వేరు కాదని ప్రజలకు క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. పైకి మాత్రం తమ మధ్య రాజకీయ శత్రుత్వం ఉన్నట్లుగా నమ్మించడానికి టీఆర్ఎస్, బీజేపీ డ్రామా నడిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీపై ఒత్తిడి తేవాలని.. అందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.

(మరో ప్రత్యేక కథనం తో మళ్ళీ కలుద్దాం…)


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!