హత్య కేసుగా మారిన అనుమానస్పద మృతి.
సాంకేతిక ఆధారాలతో కేసును చేదించిన వన్ టౌన్ పోలీసులు.
కేసు చేదించిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.
వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ఆదిలాబాద్ : శుక్రవారం అర్ధరాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక పంజాబ్ కూడలి వద్ద గల మురికి కాలువలో అనుమానస్పదంగా మృతి చెందిన మహిళ అనిత కేసును హత్యకేసుగా ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు తేల్చడం జరిగింది.
నిందితుడి వివరాలు
నర్సింగా సంతోబా గంపల్వాడ్ (25) s/o సంతోబా, కులం: కోలి, వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్/కూలీ, నివాసం: సిరంజని గ్రామం, హిమాయత్ నగర్ తాలూకా, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర.
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మహిళ హత్య కేసు వివరాలను వెల్లడించారు. కేవలం 48 గంటల్లో కేసును ఛేదించిన వన్ టౌన్ పోలీసుల పనితీరును ఆయన అభినందించారు.
వివరాలలో
ఏప్రిల్ 24, 2026న అర్ధరాత్రి పంజాబ్ చౌక్‌లోని హల్దీరామ్ షాప్ సమీపంలోని డ్రైనేజ్‌లో మృతదేహం లభ్యమైంది.
ఫిర్యాదుదారు జనగామ్వార్ సంతోష్ తన సోదరి జనగామ్వార్ అనిత మృతి పై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్, వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను, సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. దర్యాప్తులో నిందితుడు నర్సింగా సంతోబా గంపల్వాడ్ (25), మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా, నిందితుడు సంఘటన రోజున పంజాబ్ చౌక్ సమీపంలో మద్యం సేవించి, రాత్రి సమయంలో సంఘటన ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, రోడ్డుపై నిద్ర మత్తులో ఉన్న ఒక రోడ్డు పక్కన చెత్త ఏరుకునే మహిళను గమనించాడు. ఆమెను ఎవరు లేని ప్రదేశం మైన మురికి కాలువ వద్దకు తీసుకెళ్లి, ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమె గొంతు పట్టి హత్య చేసి, ఆధారాలు దాచిపెట్టేందుకు మృతదేహాన్ని సమీప డ్రైనేజ్‌లో పడేసినట్లు వెల్లడైంది.
కేసు నమోదు అయిన 48 గంటల్లోనే నిందితున్ని పట్టుకొని, ఛేదించి, ఈ రోజు (27.04.2026) ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నేరాలపై పోలీసులు వేగంగా స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేశారు ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హత్య కేసును చేదించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంస పత్రాలను, నగదు రివార్డులను అందజేసి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సైలు సంజయ్, అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments