Saturday, March 22, 2025

దారితప్పిన ….
మెయిన్ స్ట్రీం మీడియా


సోషల్ మీడియానే పేదలకు దిక్కు..?
◆ కార్పొరేట్ మీడియా దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
సెలబ్రిటీల కోసమేనా…?
సామాన్యుడి గోడు మీకు పట్టదా..?
ఫాంహౌజ్ సర్కారే.. చెప్పినట్లు మాత్రమే పనిచేస్తుందా?

(‘రిపబ్లిక్ హిందూస్థాన్’కు ప్రత్యేకం… అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం)


తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం అవాంఛనీయ కోణం వైపు పరుగెడుతుందా..? అంటే ఈ సంఘటనలే నిదర్శనం. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టే ధైర్యం కోల్పోయింది. ‘లేని మీసాలకు సంపంగి నూనె ‘ రాసుకొని.. ఉన్నోడి జబ్బలు తమ జబ్బలుగా ఫీలయి.. బాదుకుంటూ ఇదే జర్నలిజం అనే 6వ జండర్ స్థాయిలో మెయిన్ స్ట్రీం మీడియా జోరుగా ఊగిపోతుంది. మీడియాను వ్యాపారంగా మార్చి, దిగజార్జిన ఘనత ఏ ‘దొర’లది.?

మెయిన్ స్ట్రీమ్ మీడియా పని అయిపోయిందా..?:

పేద, అట్టడుగు వర్గాల గోడు ఈ మీడియాకు పట్టదా..? సెలబ్రిటీలు, వీవీఐపీలకు సంబంధించిన అంశాలే మెయిన్ మీడియాకు ముఖ్యమా..? చిన్నారి (పేరు పేర్కొనటం లేదు) అమానుష హత్యోదంతం తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ స్ట్రీం మీడియా స్పందించిన తీరు ఆవేదన భరితం. క్యాండిల్ ర్యాలీలు, రెస్ట్ ఇన్ పీస్ లతో బాధితులకు న్యాయం జరుగుతుందా..? ఎవరిని రక్షించడానికి ఈ దాగుడుమూతలు. ఫామ్ హౌజ్ కు పరిమితం అయిన..లేదంటే బయటకు వచ్చినా తమ రాజకీయ స్వార్థం కోసం మాత్రమే వచ్చే సర్కార్ ని కాపాడటం కోసమా? లేదా ఖాకీల వైఫల్యాల ఘనకార్యాలకు మసిపూసేందుకా? చిన్నారి అత్యాచారాన్ని, హత్యను చూపించని మీడియా అసలు ఉన్నట్టా..? లేనట్టా.?

నాటి స్ఫూర్తి.. నేడు:
నిర్భయ ఘటనతో దేశాన్నంతా ఒక్కటి చేసింది మీడియా. ప్రభుత్వం తలొగ్గి నిర్భయ చట్టం తీసుకొచ్చి మానవమృగాల వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. కాని ఆ చట్టాల అమలు కఠినంగా జరగటం లేదు. కనీసం అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. అందుకే ఇంకా ఇలాంటి ఘోరాలు జరుగుతునే ఉన్నాయి. ‘కన్నేత్తి చూస్తే.. కళ్లు పీకేస్తా’ అన్న కేసిఆర్ ఇప్పుడు ఓ చిన్నారికి ఇంత ఘోరం జరిగితే.. కనీసం వాళ్ల నాయకులనైనా పరామర్శకు పంపలేదు. కేసిఆర్ తీరుని ప్రశ్నిస్తే.. తమ మీడియా సంస్థలు ‘ఎక్కడ ఆగమవుతాయో’ అన్న భయంతో ఒక్క మీడియా కూడా చిన్నారికి జరిగిన అన్యాయాన్ని చూపించడం లేదు. మరో ఆడపిల్లకు ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం లేదు. సామాజిక వేత్తలతో అభిప్రాయాలు తీసుకోవడం లేదు. వార్తను వార్తగా వేయాలంటనే భయపడుతున్నారు. కేవలం యూట్యూబ్ వ్యూవర్స్ని ని దృష్టిలో పెట్టికొని మాత్రమే ఛానల్ నడుపుతున్నారు. డుగ్గు డుగ్గు కు.., సినిమా ఇండ్రస్టీ కి ఇచ్చిన ప్రాధాన్యతలో కొంతైనా.. ప్రజాసమస్యలపై చూపించడం లేదు.

అందుకే సోషల్ మీడియా ముందుకు:
సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వెలికి తీస్తుంది సోషల్ మీడియా. మూడు రోజుల క్రితం ఘోరం జరిగితే స్క్రోలింగ్ కూడా వేయని పరిస్థితిల్లో యూట్యూబ్ ఛానల్స్ గంటల కొద్ది ప్రత్యేక్ష ప్రసారాలు చూపిస్తున్నారు. రేటింగ్ కాదు ‘సామాజిక బాధ్యత’ అంటూ ఏం జరిగిందో బాధితుల వర్షన్ వినిపిస్తున్నారు. ఎలా న్యాయం కావాలో వారి డిమాండ్ ని చూపిస్తున్నారు. ఆందోళనలకు అడుగడుగున సపోర్ట్ చేస్తున్నారు.

సిగ్గు పడాల్సింది ఎవరు.?:
ఒకప్పుడు రాసే వాడు మాత్రమే దమ్మున్న జర్నలిస్ట్. మరి ఇప్పుడు ఎంత మందికి ఆ దమ్ము ఉంది.? పత్రికలలో పనిచేసే ప్రతి ఒక్కడూ జర్నలిస్ట్ కాలేడు. ప్రజల కోసం పనిచేసే వాడే నిజమైన, నిఖార్సయిన జర్నలిస్ట్. అక్రిడేషన్ కార్డుల కోసమో..? రాని ఇళ్ళ స్థలాల తాయిలాల కోసం విలువలను తాకట్టు పెట్టి… దొంగలకు సద్దులు మోసే మీరు జర్నలిస్టులా..? ఎర్నలిస్టులా..? మీ యజమానులకు ఆస్తులు పెంచే యంత్రాలా..? జర జర్నలిస్టులూ… కనీసం ఇక నుంచి అయినా జర్నలిస్టుల్లా బతుకుదామా..? లెక.’దొర’ పాదాల దగ్గర బానిసులుగా బతుకీడుద్దామా..? నిర్ణయం మీదే.!

చివరిగా..:
ఓ చిన్నారీ… క్షమించమ్మా.. నీకు జరిగిన అన్యాయం గురించి నిలదీయలేని మెయిన్ స్ట్రీం మీడియా తప్పకుండా తన చితి తానే పేర్చుకుంటుంది. ఓం శాంతి.. శాంతి.. శాంతి.

(‘రిపబ్లిక్ హిందూస్థాన్’కు ప్రత్యేకం… అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం)


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి