పోడు భూముల సమస్యల త్వరలో కార్యాచరణ ప్రారంభించడానికి కసరత్తు
ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం లో పలు అంశాల పై చర్చ…
రిపబ్లిక్ హిందుస్థాన్ : రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అక్టోబర్ మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పోడు భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఒక్క గజం జాగ అటవీ భూమి భవిష్యత్తులో అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని, దురాక్రమణలు అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.
అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలకైనా వెనకాడబోదన్నారు. పోడు సమస్యను పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అవసరమైతే నేతలకు అటవీ భూములు అన్యాక్రాంతమైన విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు.
అటవీ పరిరక్షణ కమిటీలను నియమించేందుకు విధి విధానాలను తయారు చేయాలని సీఎం అధికారులను అదేశించారు.
అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవి అంచున భూమిని కేటాయిస్తామన్నారు. అట్లా తరలించిన వారికి సర్టిఫికేట్లు ఇచ్చి, వ్యవసాయానికి నీటి సౌకర్యం, కరెంటు వంటి వసతులు కల్పించి, రైతుబంధు రైతుబీమాను కూడా వర్తింపచేస్తామన్నారు.
పోడు భూముల అంశంపై ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసీఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ శోభ, ఆర్.ఎం. డోబ్రియాల్, స్వర్గం శ్రీనివాస్, హైదరాబాద్ సర్కిల్ సిసిఎఫ్ అక్బర్, సిసిఎఫ్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరక్టర్ రాజా రావు, టిఎస్ టిఎస్ ఎండి వేంకటేశ్వర్ రావు, ట్రైబల్ వెల్పేర్ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా చొంగ్తూ, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… “మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి. బయో డైవర్సిటీ కూడా పెరిగింది. హరితహారం కార్యక్రమం ద్వారా సాధిస్తున్న ఫలితాలతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరిత నిధికి విశేష స్పందన వస్తున్నది.
అడవులను రక్షించుకునే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ కనపరచాలె. సమర్థవంతమైన అధికారులను నియమించాలె. వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించండి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు.
‘‘అడవి బిడ్డలకు అడవుల మీద ప్రేమ ఉంటుంది. వారి జీవన సంస్కృతి అడవులతో ముడిపడి ఉంటుంది. వారు అడవులను ప్రాణంగా చూసుకుంటారు. అడవులకు హాని తలపెట్టరు. వారి జీవిక కోసం అడవుల్లో దొరికే తేనెతెట్టె, బంక, పొయిల కట్టెలు తదితర అటవీ ఉత్పత్తుల కోసం మాత్రమే వారు అడవులను ఉపయోగించుకుంటారు. ప్రభుత్వం వారి జీవన హక్కును కాపాడుతుంది. సమస్య అంతా కూడా బయటి నుంచి పోయి అటవీ భూములను ఆక్రమించి, అటవీ సంపదను నరికి, దుర్వినియోగం చేసేవారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం. పోడు భూముల సమస్య పరిష్కారమైన మరుక్షణం నుంచే అటవీభూముల రక్షణ కోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలను ప్రారంభిస్తుంది.
ఆ తర్వాత అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకోవడం అటవీశాఖ అధికారులదే బాధ్యత. ‘‘నన్ ఈజ్ ఇన్ సైడ్. ఇన్ సైడ్ ఈజ్ ఓన్లీ ఫారెస్ట్’’ (అడవి తప్ప, లోపల ఎవరూ ఉండటానికి వీల్లేదు) ’’ అని సీఎం స్పష్టం చేశారు.
అక్టోబర్ మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించాలని, దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా చర్యలు చేపట్టాలని, సీఎం సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి వారికి తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎమ్మెల్యేల సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు అటవీ భూముల రక్షణలో కీలకంగా పనిచేయాలన్నారు.
నవంబర్ నెల నుంచి అటవీ భూముల సర్వేను ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. కోఆర్డినేట్స్ ద్వారా ప్రభుత్వ అటవీభూముల సరిహద్దులను గుర్తించాలన్నారు. అవసరమైన మేరకు కందకాలు తొవ్వడం, ఫెన్సింగ్ తదితర పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కావాల్సిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ అందిస్తామని తెలిపారు. అంతిమంగా అందరి లక్ష్యం ఆక్రమణలకు గురికాకుండా అడవులను పరిరక్షించుకునేదై వుండాలని సీఎం స్పష్టం చేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments