◾️నాలుగు రోజుల్లో ఫోన్ రికవరీ చేసి కేసులు ఛేదిస్తున్న ఖాకీలు
◾️ప్రత్యేకత చాటుకుంటున్న ఆదిలాబాద్ పట్టణ పోలీసులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం :
‘ఫోన్ పోతే దొరకదు’ అన్న భావనను ఆదిలాబాద్ పట్టణ పోలీసులు చెరిపేస్తున్నారు. బాధితులు ‘మీ-సేవ’లో ఫిర్యాదు చేయగానే ఖాకీలు రంగంలోకి దిగుతున్నారు. పండుగలు, పబ్బాలు తేడా లేకుండా పని చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి యాక్షన్ తీసుకుంటున్నారు. నాలుగు నుంచి వారం రోజుల్లో కేసులను ఛేదిస్తున్నారు. మొబైల్ లను రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు. పోలీసులంటే ఆదిలాబాద్ పట్టణ ప్రజల్లో ఒక రకమైన భరోసాను నింపుతున్నారు. ఇటీవల టూ టౌన్ లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.
మీ సేవలో ఫిర్యాదు…
మొబైల్ ఫోన్ల చోరీకి తెలంగాణలో మీ సేవ ద్వారా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ట్రేసింగ్ చేసి ఫోన్లను కనుగొంటున్నారు. ఆన్ లైన్ ద్వారా మీ-సేవ లో ఫిర్యాదులు చేసినట్లయితే, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫోన్లు రికవరీ అయిన అనంతరం బాధితులకు సమాచారం అందిస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ ఆదినాథ్ తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
నాలుగు రోజుల్లో కేసును ఛేదించి…
ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన జర్నలిస్ట్ ఫిరోజ్ ఖాన్ పని నిమిత్తం నెహ్రూ చౌక్ లో ఉండగా.. దొంగలు తమ పని తనాన్ని చూపించారు. అతని జేబులో నుంచి సెల్ ఫోన్ ను దొంగిలించారు. అప్రమత్తమైన ఆయన డయల్ 100కు ఫోన్ చేసి విషయాన్ని తెలపగా, ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు స్పందించారు. వారి సలహా మేరకు మరుసటి రోజు ఉదయం ‘మీ-సేవ’లో ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ ఎస్పీ సూచనలతో రంగంలోకి దిగిన ఆదిలాబాద్ టూటౌన్ ఎస్ఐ ఆదినాథ్ సంఘటన స్థలానికి వెళ్లారు. పూర్తిస్థాయిలో విచారించి ఫోన్ చోరీ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అతడు ఆ ఫోన్ ను రూ. 2వేలకు ఒకరికి అమ్మేశానని చెప్పగా.. కొన్న వ్యక్తిని పిలిపించారు. అతను కూడా ఆ ఫోన్ ను రూ. 6వేలకు అమ్మేశానని చెప్పగా. రెండోసారి కొన్న అతను బేల మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీంతో అతడికి విషయాన్ని చెప్పి ఫోన్ ను తెప్పించారు. రెండు నుంచి మూడు రోజుల్లో ఈ ప్రక్రియనంతా కంప్లీట్ చేసి.. జర్నలిస్ట్ ఫిరోజ్ ఖాన్ పోగొట్టుకున్న ఫోన్ ను అతడికి అప్పగించారు. దీంతో ఫిరోజ్ ఖాన్ ఆదిలాబాద్ ఎస్పీ తోపాటు ఎస్ఐ ఆదినాథ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సెల్ ఫోన్ పోతే ఎన్నో సమస్యలు..
సెల్ ఫోన్ మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ఎందుకంటే మన విలువైన డాక్యుమెంట్లు, ఫొటోలు.. ఇలా అన్నీ సెల్‌ఫోన్‌లోనే ఉంటున్నాయి. అది పోతే చాలా కష్టమే. పోయిన నెంబర్లు, డేటా రికవరీ చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ డేటా ఇతరుల చేతికి చిక్కుతుందేమోననే ఆందోళన వెంటాడుతుంది. కొంతకాలంగా ఫోన్లు దొంగతనం చేస్తున్న ముఠాలు.. వాటిని ఇతర నేరాలకు ఉపయోగిస్తున్నాయి. అయితే ఆ డేటా మరొకరి చేతికి వెళ్లకుండా ఉండాలంటే ఫోన్ పోయిన విషయాన్ని గుర్తించిన వెంటనే కేంద్ర టెలికాం శాఖ నిర్వహించే CEIR (Central Equipment Identity Register) అనే వెబ్ సైట్ కు సమాచారం ఇవ్వాలి. “సీఈఐఆర్ వాళ్లు ఆ ఫోన్ బ్లాక్ చేస్తారు. దాని వలన ఫోన్ దొంగిలించిన/దొరికినవాళ్లు మన ఫోన్‌ను ఉపయోగించకుండా ఆపవచ్చు. అలాగే గూగుల్ అకౌంట్ల నుంచి సైన్ అవుట్ అవ్వాలి. అప్పుడు మొబైల్‌లో ఎలాంటి సమాచారం బయటకు పోదు. సెల్ ఫోన్ పోతే చాలా మంది ఫిర్యాదు చేయకుండా కొత్తది కొనుక్కోవాలని చూస్తారు. కానీ అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments