వ్యాసకర్త : గాజుల రాకేష్ పటేల్
త్యాగాల నేల ఈ తెలంగాణ అందులో అడివితల్లి నే ఆసరాగా చేసుకుని దాయాదుల పై పోరు సలిపి నేలకొరిగిన ఆదివాసీ ముద్దుబిడ్డలు కొమురం భీం అయితే మరొకరు రాంజీ గోండ్.

రాంజీ గోండ్ పాలకులు విస్మరించిన యోధుడు, చరిత్ర మరిచిన ఉద్యమనాయకుడు, అటు బ్రిటిష్ సైన్యాన్ని, ఇటు నిజాం లను గడగడ లాడించి ముడుచేరువుల నీళ్ళు తాగించిన ఆదివాసీ నాయకుడు రాంజీ గోండ్.
నిమ్మరాజులు పాలించిన నిర్మల్ పట్టణం గుట్టలు, చెరువులు, బురుజులు, కొయ్యబొమ్మలే కాదు.. సాహసో పేతమైన వీరుల త్యాగాలు చరిత్రకు సజీవసాక్ష్యం.
నాటి స్వాతంత్య్ర సంగ్రామానికి పునాదులు వేసి, ఎందరో వీరుల్లో స్ఫూర్తి నింపి పోరాటంలో భాగమైన పోరుగడ్డపై రోహిల్లా దండు తోడుగా గోండు వీరుల అండతో రాంజీ గోండు సాగించిన పోరాటం అసమాన్యం, శత్రువు చేతికి చిక్కినా వెరువకుండా మాతృభూమి కోసం ఒకేసారి వెయ్యిమంది ఉరికొయ్యలు ముద్దాడిన ఘనత నిర్మల్ గడ్డది.
ఒకే మర్రి చెట్టుకు ఒకే సమయంలో వెయ్యి మందిని ఉరి తీసిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. ఆ కర్కశ, క్రూర ఘటనకు నిర్మల్ వేదికయ్యింది. వెయ్యి మందిని ఒకే చెట్టుకు ఉరి తీశారా అది నమ్మొచ్చా అని అనుమానం రావడం సహజమే, కానీ అది నిజంగా జరిగింది . ఆ ఘటన జరిగి నేటికి 163 యేళ్లు.
అది బ్రిటిష్ పరిపాలన సమయంలో మొదటి స్వతంత్ర సంగ్రామం 1857 సిపాయిల తిరుగుబాటు.
ఆ స్వాతంత్ర సంగ్రామానికి మన తెలంగాణ నేలకూడా భాగస్వామ్యం అయ్యింది.

దానికి ఆదివాసీ ముద్దుబిడ్డ *మర్సుకొల రాంజీ గోండ్* నాయకత్వం వహించాడు.
బ్రిటిష్ వారు రాకపుర్వం అంటే 1240 నుండి 1750 వరకు సుమారు 5 శతాబ్దాల పాటు గోండుల పాలన జరిగింది.
మహారాష్ట్ర, ఒడిషా,మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లలో నివసించే అనేక గిరిజన ఆదివాసీ తెగలతో కలిసి గొండ్వాన రాజ్యం ఏర్పడింది.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా గొండ్వాన రాజ్యంలో భాగంగా ఉండేది.
ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గోండు రాజులలో చివరి వాడైన నీలకంట్ శా (1735- 1749 ) ను మరాఠీలు బందించి చంద్రాపూర్ ను అక్రమించుకోవడం తో గొండ్వాన ప్రాంతం మరాఠీల అధీనంలోకి వెళ్ళింది.
తర్వాత ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులు చేజిక్కించకున్నరు. అటు తర్వాత హైదరాబాద్ నిజాం పాలన, ఆంగ్లేయుల పాలన కొనసాగింది.
బ్రిటిష్ సైన్యం మరియు నిజాం సైన్యాల దౌర్జన్యాలకు అడ్డులేకుండా పోయింది. గ్రామాలపై పడి వారు చేసే అరాచకాలు తీవ్రంగా ఉండేవి, ఎక్కడినుండి ఏ సైన్యం గ్రామలమీద పడి అరాచకాలు సృష్టిస్తారో నని ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అది బరించలేని రాంజీ గోండ్ తోటి ఆదివాసులను వెనకేసుకు బ్రిటిష్ వారికి నిజాం సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు.
ప్రస్తుత ఆసిఫాబాద్ ను కేంద్రంగా చేసుకుని సైన్యాలను దీటుగా ఎదుర్కొంటూ తన పోరాటాన్ని సాగించారు.
ఆ సమయంలో అటు ఉత్తర భారతదేశంలో ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగసింది.
బ్రిటిష్ సైన్యంతో ఝాన్సి లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియ తోపే, రావ్ సాహెబ్ లు పోరాటం కొనసాగిస్తున్నారు.
కానీ బ్రిటిష్ సైన్యం ముందు నిలువలేక వారంతా వారి వారి బలగాలతో తలోదిక్కు గా విడిపోయారు.
అందులో తాంతియ తోపే అనుచరులైన రోహిల్ కండ్ ప్రాంతానికి చెందిన రోహిల్యలు పెద్ద సంఖ్యలో ఒరంగాబాద్, బీదర్, పర్బాని,ప్రాంతాలతో పాటు ఉమ్మడి అదిలాబాద్ లోకి ప్రవేశించారు.
ఆ సమయంలో నిర్మల్ లోని బ్రిటిష్ కలెక్టర్, తాలుక్ దార్ ఆగడాలు పెరగడంతో రాంజీ గోండ్ నిర్మల్ పై దృష్టి పెట్టాడు. రాంజీ గోండ్ కి రోహిల్ల దండు తోడైంది. రాంజీ గోండ్ నాయకత్వంలో పోరు ఉదృతం అయ్యింది.
రాంజీ తన పోరాట పటిమ తో నిర్మల్ కొండలు,అడవి, చెరువులను ఆధారంగా చేసుకుని బ్రిటిష్ సైన్యాన్ని, నిజాం సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టి పరుగులు పెట్టించేవాడు.
రాంజీ తో పోరాటం చేయలేక నిర్మల్ కలెక్టర్ హైదరాబాద్ లోని బ్రిటిష్ రెసిడెంట్ కి సమాచారం పంపగా వారు కర్ణాటక బల్లారిలోని స్వదేశీ దళం కల్నల్ రాబర్ట్ ను నిర్మల్ లో దింపారు.
ఆధునిక ఆయుధాలతో కూడిన రాబర్ట్ బృందాన్ని రాంజీ గోండ్ రెండు సార్లు ఎదుర్కుని ఓడించాడు. రాంజీ చేస్తున్న పోరాటానికి రాబర్ట్ సైన్యం తాళలేక పోయింది.
రాంజీ తో ఈ కొండ కోనల్లో యుద్ధం చేయడం అసాధ్యం అని గ్రహించి రాంజీ ని దొంగ దెబ్బతీసి గోదావరి తీరం లోని సొన్ వద్ద చుట్టుముట్టి రాంజీ గోండ్ సహా వెయ్యిమంది ని పట్టుకుని నిర్మల్ వరకు ఇడ్చుకుంటు తీసుకుని వచ్చారు. నిర్మల్ సమీపంలోని మహా మర్రి చెట్టుకు 1860 ఏప్రిల్ 9 వ తేదీన వెయ్యి మందిని ఒకే సారి ఉరితీసి చంపేశారు. తమ హక్కుల కోసం స్వయం పాలన కోసం ఆంగ్లేయుల పై, నిజాం సైన్యాల పై పోరాటం సలిపిన ఆ మహాయోధుడు మహా వృక్షానికి వేలాడబడ్డాడు.
స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేసిన మొదటి ఆదివాసీ నాయకుడిగా మర్సు కొల రాంజీ గోండ్ చరిత్రలో నిలిచిపోయాడు.
యోధుడు చనిపోయిన ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన పోరాట పటిమ ఎందరికో ఆదర్శం అయ్యింది.
నాటి నుండి ఆ మహావృక్షం వెయ్యి ఉరుల మర్రి గా పిలువబడుతుంది. 1995 లో వచ్చిన గాలి వానకు ఆ మహావృక్షం నేలకొరిగింది.
తిరిగి ఆ ఘటనకు గుర్తుగా ప్రజా యుద్ద నౌక గద్దర్ మరో మర్రి వృక్షాన్ని నాటారు.
కానీ ఆ యోధుడి పోరాటాన్ని ఏ పాలకులు గుర్తించలేదు. నేను నిర్మల్ లో చదువుకుంటున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో నిర్మల్ లోని కొన్ని సంఘాలు ఆయన చిన్న విగ్రహాన్ని చైన్ గేట్ వద్ద నిర్మించారు, అలాగే మర్రి చెట్టు ప్రాంతంలో ఓ స్మారకాన్ని ఏర్పాటు చేశారు.
అయితే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా 2021 నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ ప్రాంతాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ద్వారా రాంజీ గోండ్ తో సహా వెయ్యి మంది ప్రాణ త్యాగాల చరిత్ర దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

తెలంగాణ పోరాట యోధుల చరిత్రను దేశవ్యాప్తంగా తెలిసేలా చేసేందుకు కేంద్ర హంశాఖామంత్రి అమిత్ శా తెలంగాణ విమోచన దినం రోజున తెలంగాణలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ నాటి వీరుల చరిత్రను దేశవ్యాప్తం చేస్తున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments