గంజాయిపై ఉక్కుపాదం
Thank you for reading this post, don't forget to subscribe!
ఆదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 10 : జిల్లాను గంజాయి రహితంగా మార్చే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. సిరికొండ మరియు నేరడిగొండ మండలాల్లోని వ్యవసాయ భూముల్లో 73 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొక్కల మొత్తం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 6.4 లక్షల రూపాయలు.
సిరికొండ మండలం నారాయణపూర్ గ్రామంలో సేడం దేవరావు (40) తన మక్క, సోయా చేనులో 66 గంజాయి మొక్కలను చట్టవిరుద్ధంగా పండిస్తుండగా, నేరడిగొండ మండలం గజిలి గ్రామంలో పెందుర్ సీతాబాయి తన మక్క చేనులో 7 మొక్కలను పండిస్తున్నట్లు సిసిఎస్ బృందం మరియు ఇచ్చోడ సీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో గుర్తించారు. ఈ ఇద్దరిపై సిరికొండ, నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లలో ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ మాట్లాడుతూ, గంజాయి పండించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వారు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దేందుకు పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. గంజాయి పండించడం, వ్యాపారం చేయడం, సేవించడం, రవాణా చేయడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి. చంద్రశేఖర్, ఎస్సైలు వి. పురుషోత్తం, ఇమ్రాన్, పూజ, సిసిఎస్ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Recent Comments