రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ చైర్మన్ పదవి అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన ఈ పదవిని ఒక ఆదివాసీ బిడ్డకే కేటాయించాలని డిమాండ్ బలపడుతోంది. ఈ నేపథ్యంలో బజార్ హత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ జల్కే పాండురంగ్‌కు మద్దతుగా నాయకులు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ కి మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జల్కే పాండురంగ్ ఆదివాసీ కుటుంబానికి చెందినవారని, గిరిజనుల సమస్యలు, వారి జీవన విధానం, ఎదుర్కొంటున్న కష్టనష్టాలు ఆయనకు దగ్గరగా తెలిసినవని పేర్కొన్నారు. అడవి హక్కులు, భూమి సమస్యలు, ఉపాధి, విద్య, ఆరోగ్య రంగాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలు సూచించగల నాయకత్వం ఆయనదేనని అభిప్రాయపడ్డారు.
పార్టీ కష్టకాలంలోనూ కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకుని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన నాయకుడు జల్కే పాండురంగ్ అని కొనియాడారు. రాజకీయ లాభనష్టాలు పక్కనపెట్టి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన ఆయనకు ఐటీడీఏ చైర్మన్ పదవి ఇస్తే నిజమైన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఐటీడీఏ చైర్మన్ పదవి కేవలం రాజకీయ నియామకం కాదని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దిశానిర్దేశం చేసే బాధ్యత అని తెలిపారు. ఒక ఆదివాసీ బిడ్డ చేతుల్లో ఈ బాధ్యత ఉంటే ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతాయని, గిరిజనుల విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఆదివాసీ కుల సంఘాల 9 తెగలకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వం వహించిన అనుభవం కలదు.
ఈ అనుభవం కేవలం పదవులు నిర్వహించడం మాత్రమే కాదు
గిరిజనుల హక్కుల సాధన, భూసమస్యల పరిష్కారం, విద్య–ఉపాధి అవకాశాల కోసం పోరాటం, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత కోసం కృషి వంటి అనేక రంగాల్లో చురుకైన పాత్ర పోషించిన అనుభవం.
మండల స్థాయిలో ప్రారంభమైన సేవా ప్రయాణం, జిల్లా మరియు రాష్ట్ర స్థాయికి విస్తరించి 9 తెగల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఆడే గజేందర్ విషయాన్ని ఉన్నత నాయకత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గిరిజన హక్కులు, అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం నేపథ్యంలో ఈ డిమాండ్‌కు పార్టీ వర్గాల్లో ప్రాధాన్యం పెరుగుతోంది.


Recent Comments