గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.
గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:
గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. “గీ” అనే అక్షరం త్యాగాన్ని ను బోధించుచున్నది. “త” అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ , బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం ప్రారంభించండి.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|
పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||
ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు , సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా , అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా , ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి , ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే , మరోపక్క లోకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట. అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి , ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో , అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు , మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః. అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృర్ణోతి నరో పరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ
చిరిగిపోయిన పాతబట్టలను విడిచి మనుషులు ఇతర కొత్తబట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహియనే ఆత్మా కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు.
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః
ఈ ఆత్మను ఆయుధములేవీ కూడా ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు , నీరు తడుపజాలదు , గాలి ఎండింపజాలదు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గో స్త్వకర్మణి
అర్జునా ! నీకు కర్మను చేయటంలోనే అధికారము వుంది. కర్మఫలాలను ఆశించుటలో ఏనాడూ కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు అవ్వకు. మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగకుండుగాక.
యదా యదా హాయ్ ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్
ఓ అర్జునా ! ఎప్పుడెప్పుడు ధర్మమూ క్షీణించి , అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో , అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
సాదు , సజ్జనులను సంరక్షించటం కోసం , దుర్మార్గులను వినాశం చేయడానికి , ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను.
కృష్ణుడంటాడు “ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం…” అని , అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు. భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని , ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు. ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు , చెడు లక్షణాలను , చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము.
నిజమైన దేవుడు ఆయనను నమ్మినా , నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు , ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతికిరణం , ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు , అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా , కొద్దిగా గంగాజలం త్రాగినా , కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. వారికి మోక్షం లభిస్తుంది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments