కోటి 70 లక్షల రూపాయలు మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు, అరెస్ట్ చేసి రిమాండ్
నిందితుడు: విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న వ్యక్తి
ఆదిలాబాద్ , హిందుస్థాన్ : ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం—
ఈ నెల 2వ తేదీ సాయంత్రం 5:30 గంటల సమయంలో నిజామాబాద్‌కు చెందిన గుడూరు ఉమారాణి (45), ప్రైవేట్ టీచర్, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, 2014లో సల్మాన్ అలియాస్ సోలోమన్ రాజ్ (తండ్రి: సామూలే) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నానని నమ్మబలికాడు. 2018లో వ్యక్తిగత అవసరాల కోసం రూ.2 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించాడు.
అనంతరం 2022లో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి, ఆమె పేరుతో ఖాతా తెరవించి పలుమార్లు డబ్బులు తీసుకున్నాడు. ఫిర్యాదుదారు తన పరిచయస్తుల వద్ద నుంచి సుమారు రూ.1.40 కోట్లు అప్పుగా తీసుకుని నగదు మరియు బ్యాంక్ ద్వారా నిందితుడికి ఇచ్చింది.
ఇంకా, ఆమె కుమార్తెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మరో రూ.30 లక్షలు వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని విడతల వారీగా ఆన్‌లైన్ ద్వారా ఆదిలాబాద్ విద్యానగర్‌లోని అతని కార్యాలయంలో చెల్లించినట్లు తెలిపారు.
మొత్తం కలిపి సుమారు రూ.1.70 కోట్లు ఇచ్చినప్పటికీ, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగం కూడా ఇప్పించకుండా మోసం చేసి తప్పించుకుంటున్నాడని ఫిర్యాదుదారు ఆరోపించింది.
ఈ మేరకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
మోసగాళ్ల మాయమాటలకు లోనుకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


Recent Comments