ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper

షెడ్యూల్ ప్రాంత కేసులపై హైకోర్టు వ్యాఖ్యలు అభ్యంతరకరం

📰 Generate e-Paper Clip


రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా న్యాయవ్యవస్థ వ్యవహరించాలి: ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్

గుడిహత్నూర్, డిసెంబర్ 29, 2025: ఏజెన్సీ ప్రాంతాల్లో భూ బదలాయింపులను నిరోధించే LTR చట్టం ఉల్లంఘనలపై గౌరవ తెలంగాణ హైకోర్టులో జరిగిన కేసు వాదనల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరమని ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవ దౌలత్ రావు మొకాశి ఒక ప్రకటనలో తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల అంశంపై విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి నగేష్ బీమపాక చేసిన వ్యాఖ్యలు ఆదివాసీ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “నాగరికత నేర్పించేందుకు గత ప్రభుత్వాలు మైదాన ప్రాంత గిరిజనేతరులను ఏజెన్సీ ప్రాంతాలకు తరలించాయి” అనే భావాన్ని సూచించే వ్యాఖ్యలను ఆదివాసీ సేన తీవ్రంగా ఖండించింది.

ఓపెన్ కోర్టులో లైవ్ స్ట్రీమింగ్ నిలిపివేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాజ్యాంగబద్ధమైన న్యాయమూర్తి హోదాలో ఉండి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేయడం అనుచితమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం, చట్టాలు కూడా ఆదివాసీ గ్రామ కట్టుబాట్లు, పాలన పద్ధతుల నుంచే పుట్టాయని విస్మరించి, నాగరికతను నేర్పిన ఆదివాసులనే అనాగరికులుగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.

రాజ్యాంగం ద్వారా ఆదివాసీలకు కల్పించిన ప్రత్యేక హక్కులు, షెడ్యూల్ ప్రాంతాలకు ఉన్న రక్షణాత్మక చట్టాలను కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రాంత కేసుల కోసం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంఘాలు ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించినా అది అందని ద్రాక్షలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులపై తక్షణమే సమీక్ష జరిపి, ఆదివాసీ హక్కులను కాపాడేలా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా న్యాయవ్యవస్థ వ్యవహరించాలని ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అలాగే, చట్ట విరుద్ధ వ్యాఖ్యలను ప్రజా సంఘాలు, ఆదివాసీ శ్రేయోభిలాషులు ముక్తకంఠంతో ఖండించాలని కోరింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!