*ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రదాన్యతనిస్తున్నాం*
బాపట్ల నేటి శుభోదయ(రవి కిరణ్)
జూన్ 6
*రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ సిబ్బంది కీలకం.. గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం తగ్గింపే లక్ష్యం విధులు నిర్వహించాలి*
*రోడ్డు ప్రమాదం వల్ల సంభవించే ఒక్క మరణం ఆ వ్యక్తితో ముగిసిపోదు, ఆ కుటుంబాన్ని చిన్నబిన్నాం చేస్తుంది*
*”శిరోరక్ష – ప్రాణరక్ష” కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధారణ పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి*
*పోలీసులు ఉన్నారు, చలానాలు విధిస్తారు అనే భయంతో కాకుండా, తమ భద్రత కోసం స్వచ్ఛందంగా హెల్మెట్ దరించే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలి*
*జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ .*
ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రదాన్యతనిస్తున్నామని, గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గింపే లక్ష్యం ప్రతిఒక్కరు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశించారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా రోడ్లపై నిరంతరం ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, భద్రతపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శనివారం క్యాంపు కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్‌లో ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేక టోపీ, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, ధూళి నుంచి రక్షణకు మాస్కులు, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ORS ప్యాకెట్లను ఎస్పీ గారు స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఎండ నుంచి రక్షణ కల్పించే రౌండ్ హ్యాట్, సూర్యరశ్మి, దుమ్ము, ధూళి వల్ల కళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు డే అండ్ నైట్ కూలింగ్ గ్లాసెస్, కాలుష్యం నుంచి రక్షణకు మాస్కులు, అలాగే నిరంతరం నిలబడి విధులు నిర్వహించడం వల్ల నీరసం రాకుండా తక్షణ శక్తినిచ్చే ORS ప్యాకెట్లను అందించడం జరిగిందన్నారు. సామాన్య ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ సిబ్బంది ఎండను, ధూళిని లెక్కచేయకుండా విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ కిట్ ట్రాఫిక్ సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా “శిరోరక్ష – ప్రాణరక్ష” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతిరోజూ విధుల్లో ఉండే ట్రాఫిక్ సిబ్బంది ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
పోలీసులు ఉన్నారు, చలానాలు విధిస్తారు అనే భయంతో కాకుండా, తమ భద్రత కోసం స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలనే భావన ప్రజల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అధిక శాతం మంది ద్విచక్ర వాహనదారులేనన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రయాణ సమయంలో వారు హెల్మెట్ ధరించకపోవడమేనన్నారు. ప్రజలకు హెల్మెట్ ధారణపై విస్తృత అవగాహన కల్పించి, ప్రతి ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.
ప్రాణం ఎంతో విలువైనదని, చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా అవగాహన కల్పిస్తూ, సమర్థవంతంగా విధులు నిర్వహించి గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. 20 శాతం వరకు రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగితే ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన వారమవుతామన్నారు. రోడ్డు ప్రమాదం వల్ల సంభవించే ఒక్క మరణం ఒక వ్యక్తితో ముగిసిపోదని, ఆ కుటుంబమంతటినీ తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందన్నారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ప్రతి శుక్రవారం నిర్వహించే “ఎస్పీ సంపర్క్” కార్యక్రమంలో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఫోన్ ద్వారా నేరుగా సంప్రదించవచ్చన్నారు. అదేవిధంగా ప్రతి రెండో శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి నేరుగా కలిసి సమస్యలను వివరించవచ్చని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ సీహెచ్. చంద్రమౌళి, ఎస్‌బీ-2 ఇన్‌స్పెక్టర్ ఎం. రాంబాబు, బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ ఆర్. రాంబాబు, ఎస్.సి, ఎస్.టి సెల్ ఇన్స్పెక్టర్ బాలనాగిరెడ్డి, అడ్మిన్ ఆర్‌ఐ షేక్.మౌలుద్దీన్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments