విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నించిన గుత్తేదారు పై ఎస్ సి/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
– – ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అనసూయ బాయి అనే ఆదివాసి మహిళ తన బ్రతుకు తెరువు కొరకు పలువురి ఇండ్లలో పాచి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తరుణంలో నిన్నటి (19/05/2025) రోజున ఒక గుత్తేదారు ఇంట్లో పాచి పనులకు వెళ్ళి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావటం పలు అనుమానాలకు తావిస్తుందని, మరియు అట్టి మృత దేహాన్ని బయటవారెవ్వరికీ తెలియకుండా కొంత మందితో కలసి మాయం చేయ జూసిన గుత్తేదారుపై వెంటనే ఎస్సి/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని అన్నారు.
అదేవిధంగా అట్టి కృత్యం చేయటానికి ఆయనకు సహకరించజూసిన వారిపై కూడా తగు చర్యలు చేపట్టే విధంగా అధికారులు వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటువంటి వాటి విషయంలో అధికారులు లోతుగా ఆలోచించి పారదర్శకంగా ఉండాలని లేని ఎడల ఆదివాసుల ప్రాణాలకు లెక్కలేకుండా పోతుందని ఆయన వాపోయారు. ఇచ్చోడ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల వలసలు విపరీతంగా పెరిగి ఆదివాసుల ఉనికి లేకుండా చేస్తున్నారని దీనిని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఉంటున్నారని ఆయన మండిపడ్డారు. అనసూయ బాయి అనుమానాస్పద మృతి విషయంలో అధికారులు ఒకవేళ పారదర్శకంగా వ్యవహరించనట్లయితే నిరసనలు, ఆందోళనలతో పాటు న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు.


Recent Comments