రక్షించి ఇండియాకు తీసుకురావాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డా. జి. చిన్నారెడ్డి
రియాద్, మే 9: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు సుమారు 950 కి.మీ దూరంలోని ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బట్టు బట్టం రాజ్‌పల్లి (బీబీ రాజ్‌పల్లి) గ్రామానికి చెందిన దాసరి అరవింద్ (23)ను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని, మోసం చేసిన ఎజెంట్‌పై చర్యలు తీసుకోవాలని అతని తల్లి రాజవ్వ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.
ఈ అంశంపై వెంటనే స్పందించిన సీఎం ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి డా. జి. చిన్నారెడ్డి, తగిన చర్యలు తీసుకోవాలని జీఏడీ ఎన్నారై విభాగం అధికారులతో పాటు జగిత్యాల ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, హెల్ప్ డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, ఏసీపీ ఉమేందర్, వాలంటీర్ పద్మారాణి తదితరులు పాల్గొన్నారు.
అరవింద్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఒక ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియాకు వెళ్లాడు. ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ఏజెంట్, రూ.90 వేల రూపాయలు తీసుకుని చివరకు ఎడారిలో గొర్రెల కాపరిగా పని చేయిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అక్కడ తాగునీరు, ఆహారం, విద్యుత్, సరైన వసతి సదుపాయాలు లేక అరవింద్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతను పంపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యజమాని బలవంతంగా అతని వాట్సాప్, ఫేస్‌బుక్ ఖాతాలను తొలగించడమే కాకుండా, ఇండియా సిమ్ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, సౌదీ అరేబియాలో తెలుగు వారికే ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామని ముందుకు వచ్చిన సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) వ్యవస్థాపకులు మల్లేశన్‌తో పాటు వివిధ ప్రాంతాల అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, తేజ పళ్లెం, రాంరెడ్డి, మల్లేశం జవ్వాజీ, శంకర్ ముదిగొండ, నరేష్ సింగు, ముజమిలొద్దీన్, నూరద్దీన్ మరియు కోర్ టీమ్ సభ్యులు స్పందించారు.
సకాక ప్రాంతంలో ఉన్న సాటా టీమ్ సభ్యులు, కర్నూలు కు చెందిన డా. వినోద్ బందెల, వేములవాడ కు చెందిన మదన్, లక్ష్మణ్ మరియు మిత్రులు హుటాహుటిన అరవింద్ ఉన్న ప్రాంతానికి వెళ్లి అతనిని కలిసి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, సాటా తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.
సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు
RELATED ARTICLES


Recent Comments