అదిలాబాద్ జిల్లా, జూలై 16 : నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, చలాన్లు సృష్టించి ప్రభుత్వ రోడ్డును అక్రమంగా కబ్జా చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. ఇందులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు. ఈ విషయాన్ని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి వెల్లడించారు.
శాంతినగర్‌కు చెందిన ఫిర్యాదుదారు కౌటివార్ సుశీల్ (63) ఆస్తి సంబంధిత మోసాలపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగినేని సూర్యప్రకాశ్ రావు, ఆయన కుమారుడు రంగినేని శ్రీనివాస రావు, కుమార్తె జలగం శ్వేత, అల్లుడు జలగం అమూల్‌లు ప్రభుత్వ రోడ్డును అక్రమంగా కబ్జా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిందితులు మున్సిపాలిటీ ద్వారా హౌస్ నెంబర్ (1-1-54/5/1/A/1) సంపాదించి, 24.03.2016, 24.05.2017 తేదీలలో పన్నులు చెల్లించినట్లు నకిలీ రసీదులు సృష్టించారు. ఈ ఆధారంగా జలగం అమూల్ ఆ స్థలాన్ని తన భార్య జలగం శ్వేతకు 01.04.2016న గిఫ్ట్ డీడ్ (2487/2016) ద్వారా నమోదు చేశారు. రంగినేని సూర్యప్రకాశ్, ఎన్.బీ. శ్రీకాంత్ ఈ డీడ్‌ను అటెస్టు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ ఈ స్థలాన్ని జలగం శ్వేత పేరిట మ్యూటేషన్ చేసింది.
అదే విధంగా, నిందితులు రూ.22,900 చెల్లించినట్లు నకిలీ చలాన్ సృష్టించి, తహసీల్దార్ ఇచ్చినట్లు 10.11.2017 తేదీన పట్టా (నెం. C/1246/104)తో క్రమబద్ధీకరణ ఉత్తర్వులను నకిలీగా సృష్టించారు. రెవెన్యూ అధికారులు ఈ పత్రాలు నకిలీవని నిర్ధారించారు.
ఈ అక్రమ ఆక్రమణ వల్ల ప్రజలు, ఫిర్యాదుదారు పరిశ్రమకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నట్లు సుశీల్ పేర్కొన్నారు. విచారణలో రంగినేని శ్రీనివాస రావు, జలగం అమూల్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు. రంగినేని సూర్యప్రకాశ్ రావు, జలగం శ్వేతలను అరెస్టు చేయాల్సి ఉందనీ తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో ఆదిలాబాద్ ఒకటవ పట్టణ సీఐ బి సునీల్ కుమార్, రూరల్ సీఐ కె ఫణిదర్ కీలక పాత్ర పోషించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments