మహిళలను వేధిస్తూన్న ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న షి టీం బృందం
ఆదిలాబాద్ : జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలను వేధిస్తూ పట్టుబడిన ముగ్గురు నిందితులపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నిందితులు బబ్లు ఖానాపూర్, అవాజ్ బొక్కల్గుడా, సంతోష్ కుమ్మరివాడలు వాహనాలపై తిరుగుతూ, రద్దీ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడ్డారు.



మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం: షీ టీం
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ షీ టీం, ఇన్చార్జ్ ఏఎస్ఐ బి సుశీల నేతృత్వంలో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోంది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రాత్రి సమయాల్లో రద్దీ ప్రదేశాల్లో షీ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, మహిళల భద్రతను కాపాడుతోంది.
రెండు రోజుల్లో ముగ్గురిపై కేసులు
గత రెండు రోజుల్లో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలను వేధించిన ముగ్గురు నిందితులను షీ టీం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వీరు వికృత చేష్టలకు పాల్పడుతూ సంఘటనా స్థలంలోనే అరెస్టయ్యారు.
షీ టీం స్పెషల్ ఆపరేషన్
మహిళల రక్షణ కోసం షీ టీం బృందం రద్దీ ప్రాంతాల్లో నిరంతరం గస్తీ తిరుగుతూ, వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ వాణిశ్రీ, సిబ్బంది మహేష్, రోహిణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు సూచన
ఏదైనా అత్యవసర పరిస్థితిలో మహిళలు డయల్ 100 లేదా ఆదిలాబాద్ షీ టీం నంబర్ ☎️ 8712659953 కు సంప్రదించవచ్చని ఏఎస్ఐ బి సుశీల సూచించారు. మహిళల భద్రత కోసం షీ టీం అహర్నిశలు పనిచేస్తుందని తెలిపారు.


Recent Comments