ఆదిలాబాద్/ ఇచ్చోడ, డిసెంబర్ 31 : జిల్లాలోనీ అడేగామా కే గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి యువ సర్పంచ్ కదం విశాల్ చురుగ్గా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలు, గ్రామంలో రేషన్ షాపు లేకపోవడం వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులను కలిసి, కాలువ ద్వారా చెరువుకు నీరు విడుదల చేసే విధంగా ఇప్పటివరకు నిర్మాణం చేసిన వ్యవస్థను వినియోగంలోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆ నిర్మాణం రైతులకు ఉపయోగపడకపోవడం వల్ల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా గ్రామంలో రేషన్ షాపు లేకపోవడం వల్ల ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడంతో, రేషన్ దుకాణాన్ని సరిగామ గ్రామంలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కదం అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతున్న యువ సర్పంచ్ కదం చర్యలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన కృషికి మద్దతు తెలుపుతున్నారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ ప్రయత్నాలు త్వరలోనే ఫలితాలు ఇస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



Recent Comments