◾️ వారం రోజుల భారీ వర్షంతో అపార నష్టం
◾️ పలు మిల్లులలో ముక్కి పోయి సంచుల్లోనే మొలకెత్తిన ధాన్యం
◾️ మండల కేంద్రంలో ఉన్న మూడు మిల్లులలో దాదాపు 10 కోట్ల నష్టం
◾️ ప్రభుత్వం ఆదుకోవాలంటున్న మిల్లర్లు
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రైస్ మిల్లులలోని ధాన్యం బస్తాలు తడిసి మొలకెత్తాయి. వానాకాలం దాన్యం మిల్లింగ్ పూర్తికాకముందే యాసంగి ధాన్యం దిగుమతితో మిల్లులో బస్తాలు పేరుకపోయాయి. వందల క్వింటాళ్ళ ధాన్యం బస్తాలను తూకం వేసి నిల్వ చేశారు. మండల పరిధిలోని అన్ని రైసు మిల్లుల్లో ధాన్యం బస్తాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. గత యాసంగి, ఖరీఫ్ ప్రస్తుత యాసంగి వరకు వడ్లు నిల్వ ఉండగా మిల్లింగ్ చేసిన ధాన్యం పోను ఒక్కో మిల్లులలో టన్నుల కొద్ది బస్తాలు పేరుకుపోయాయి.

యాసంగికి సంబంధించి 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువలు రైస్ మిల్లులలో ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పలు మిల్లులో ధాన్యం బస్తాలు తడిచాయి. కొన్నిచోట్ల మొలకెత్తాయి. యాసంగి పంటను కేంద్రం కొనకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈ ధాన్యం బస్తాలను రైస్ మిల్లులలో భద్రపరచాలని మిల్లర్లకు సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ధాన్యం కొన్న మిల్లర్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్ లో కూడా రైతులు వరి సాగు చేస్తుండడంతో ప్రస్తుతం నిల్వ ఉన్న ధాన్యం ఖాళీ చేస్తేనే ఈ ఖరీఫ్ ధాన్యం నిల్వలకు స్థలం ఉంటుంది. కేంద్ర ప్రకటనకు ముందు బాయిల్డ్ రైస్ కు మంచి రోజులు వస్తాయని ఆశించిన మిల్లర్లు రైస్ మిల్లులను అప్డేట్ చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఇస్తున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి అవసరమైన సామర్ధ్య పెంపునకు ఆధునిక యంత్రాలను కూడా సమకూర్చుకున్నారు. ఎటు గాని సమయంలో వర్షాలు కురిసి ధాన్యం నిలువలు తడిసి మొలకెత్తే సరికి మిల్లర్లు అయోమయ స్థితిలో పడ్డారు. దింతో మిల్లర్ల పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉన్నది. మిల్లులలో పనిచేసే కూలీలు, హమాలిలు, ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన వాహనాలు, వాటిపై పని చేసే సిబ్బంది, మార్కెటింగ్ సిబ్బంది ఇలా విభిన్న విభాగాలకు చెందిన వారికి ఉపాధి కరువయ్యే ప్రమాదం ఉందంటున్నారు మిల్లర్లు.
ప్రభుత్వమే ఆదుకోవాలి…..

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యం
నల్లబెల్లి మండలంలోని దాదాపు అన్ని మిల్లులలో ఇదే పరిస్థితి. మిల్లింగుకు అనుమతిస్తే యాసంగి ధాన్యం ఖాళీ అయి ఖరీఫ్ కు నిల్వ ఉంటుంది. లేకుంటే ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం నిల్వ ఉంచడానికి జాగ ఉండదు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ దృష్టికి ఇప్పటికే మిల్లర్లు ఈ విషయాన్ని తీసుకెళ్లారు, వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నాం.
—- పాండవుల రాంబాబు, శివశంకర్ రైస్ మిల్లు నల్లబెల్లి
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments