Tuesday, October 14, 2025

హై కోర్టు ఆదేశాలను అమలు పరచండి

గ్రామ పంచాయతీ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై  తక్షణమే చర్యలు తీసుకోండి

Thank you for reading this post, don't forget to subscribe!


వందుర్ గూడ గ్రామ గిరిజనుల డిమాండ్

దండేపల్లి  : దండేపల్లి మండల పరిధిలో గల వందుర్ గూడ వెంకటాపూర్ గ్రామ పంచాయతీల విషయంలో గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారు తీర్పు వెలువరించిన సందర్భంగా సత్త్వరమే ఒకటే పంచాయతీగా గుర్తించటానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వందుర్ గూడ గ్రామ గిరిజనులు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులతో పాటు స్థానిక ఎం పి డి ఓ, ఎం ఆర్ ఓ మరియు ఎం పి ఓ లకు వినతి పత్రాలను అందజేసినారు.


ఈ సందర్భంగా గ్రామ పటేల్ కోవ దౌలత్ రావు మొకాశి మాట్లాడుతూ అక్రమ పద్ధతిలో ఏర్పాటు చేసిన నూతన గ్రామ పంచాయతీ వందుర్ గూడ విషయంలో గత అధికారులు ప్రభుత్వానికి, లెజిస్లేచర్ కు తప్పుడు నివేదికలు ఇచ్చి గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయించినారని, అట్టి విషయమై గ్రామస్తులు పలు మార్లు వినతుల రూపంలో అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోక పోవటంతో గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంను ఆశ్రయించ వలసి వచ్చినదని ఆయన తెలిపినారు. గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద కూడా అధికారులు వారి యొక్క నివేదికలే సరైనవని పదే పదే లిఖిత పూర్వక వాంగ్మూలాలను సమర్పించినప్పటికి   కోర్టు వారు ఇట్టి విషయాన్ని తీవ్రంగా పరిగణించి వాస్తవ సమాచారం కొరకు ప్రత్యేక అధికారులను పంపించి లోతుగా పరిశీలన చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చినాయని ఆయన తెలిపినారు. వందుర్గూడ గ్రామ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 257 అని అదేవిధంగా వెంకటాపూర్ వందుర్ గూడ గ్రామాల మధ్య గల దూరము 1.5 కి. మీ. ఉన్నట్లు కోర్టు వారు ధృవీకరించినట్లు  ఆయన తెలిపినారు.

అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా తేది 11-08-2025 రోజున కోర్టుకు సమర్పించిన మెమోలో కూడా గత అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిపి ఉన్నారని ఆయన తెలిపినారు. వీటన్నింటినీ పరిశీలించిన గౌరవ కోర్టు వారు గ్రామ పంచాయతీ విషయంలో మళ్ళీ పునః పరిశీలన చేసి కొత్త నిర్ణయం తీసుకొని మళ్ళీ వాస్తవ సమాచారంను ప్రభుత్వం, లెజిస్లేచర్ దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకొనే విధంగా చూడాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపినారు.

తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై డిసిప్లీనరీ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టి ఆ తర్వాత చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు వారు ఆదేశించినట్లు ఆయన తెలిపినారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రాబోయే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే వెంకటాపూర్, వందుర్ గూడ గ్రామ పంచాయతీలు ఒక్కటే అయ్యే విధంగా త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల మరల కోర్టును ఆశ్రయించ వలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తేకం భీం రావు, కోవ తిరుపతి, కోవ మారుతి, సిడం కొమురయ్య, కుంరం బాపు రావు, కుంరం సోనే రావు,  కుద్మేత వినోద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!