epaper
Saturday, January 24, 2026

ఆదివాసీ గూడాల్లో అట్టహాసంగా హోలీ సంబురాలు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

🔶 ఘనంగా కామదహనం పండుగ సంబరాలు…

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :

ఇచ్చోడ మండలంలోని బాదిగూడా గ్రామంలో ఆదివాసులు హోలీ పండుగను పురస్కరించుకొని గురువారం కామ దహనం చేశారు. హోలీ పండుగ వచ్చిదంటే చాలు  ఆదివాసీ గూడలలో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. గిరిజనులు ఆడే ఆటపాటలు  ఆదివాసుల రంగుల వేడుకలు అడవికే అందానిస్తుంది. అడవులతోనే మమేకమైన ఆదివాసుల సహజమైన జీవనశైలికి దురాడీ కోబ్రె (కుడుకుల) పండగ అద్దం పడుతుంది. ఆదిమ గిరిజన గూడాల్లో అట్టహాసంగా జరుగుతున్న ఈ పండుగను రంగుల పున్నమిగా భావిస్తారు.హోళి పండుగ గిరిజనుల అభిమాన పండుగ.

అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఆదివాసీలు,  అత్యంత ఉత్సాహంగా జరుపుకునే ప్రకృతి పండుగ. ఈ పండుగకు వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఫాల్గుణ మాసం చంద్ర దర్శనం మొదలుకొని ఫాల్గుణ శుక్ల పౌర్ణమి వరకు వెన్నెల రాత్రుల్లో ఆడే ఆట పాట కొట్లాట అన్ని కొత్తగానే దర్శనమిస్తాయి. పండుగకు నెల ముందు నుంచే ప్రకృతిలో దొరికే ఆకులు, అలములు, గోగు పూలను తెచ్చి రంగుల్ని తయారుచేసుకుంటారు. పచ్చని ప్రకృతిలో లభించే స్వచ్చమైన గోగుపూల నుండి తీసిన రంగులతోనే హోళీ పండుగ జరుపుకోవడం గిరిజనుల తరతరాల సంప్రదాయం. హోళీ పండుగ జరుపుకోవడంలో ఆదివాసీల ఆచారం విభిన్నం. గ్రామ పటేల్ , దేవాలరికి కుడక ఇస్తేనే గూడెంలో కొనసాగుతున్నట్టు లెక్క, లేదంటే ఆ వ్యక్తులు ఆ కుటుంబాలు గూడెంతో ఎలాంటి సంబందాలు లేవని భావిస్తారు‌. దీనినే దురాడీ కోబ్రే ( కుడుకల ) పండుగ అని పిలుస్తారు ఆదివాసీ గిరిజనులు.

హోలీ పండుగ వేళ ఆదివాసులు ఈ దురాడీ కోబ్రె పండుగను రెండు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. పున్నమికి ఒకరోజు ముందు, ఆ తర్వాత రోజు కూడా ఉత్సవాలు జరుపుతారు. ఈ సమయంలో తమ ఆరాధ్య దైవంగా భావించే “మాతరి”, “మాత్రే “లను ఘనంగా పూజిస్తారు. అందులో భాగంగా సంప్రదాయబద్ధంగా వాయిద్యాల నడుమ దేవతలను ఆదివాసులు తమ ఇంటికి తీసుకెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. గూడాల్లో ఇల్లిల్లు తిరిగిన అనంతరం మాతరే, మాత్రే దేవతలను గ్రామ పొలిమేరలకు తీసుకువెళ్తారు. ఆ తర్వాత గూడెంలో ఉండే వాళ్లంతా ఒక్కొక్కరు ఒక కుడుక తీసుకువెళ్లి గ్రామ పటేల్ కు ఇస్తారు. అలా ఆరోజు ఆయన వద్దకు ఎన్ని కుడుకలు వస్తే ఆ గూడెంలో అంత జనాభా ఉన్నట్టు పరిగణిస్తారు. తన వద్దకు వచ్చే వారందరికీ పటేల్ చక్కరి పేర్లను ఇచ్చి రంగుల పున్నమి శుభాకాంక్షలు తెలుపుతారు.

మాతారి మాతరల్‌ కాముని దహనం చేసిన బూడిదను ఇతరులు దొంగలించకుండా ఉండడానికి ప్రత్యేకంగా జాగరణ చేస్తారు. ఇతర గ్రామస్తులు ఈ బూడిదను దొంగలించే ప్రయత్నం చేస్తారు. ఇది వారి ఆచారంలో ఓ భాగం. కాముడి బూడిదను తీసుకెళ్లి తమతమ ఇళ్ల ముఖద్వారం ఎదుట చల్లుతారు. ఇలా చల్లడం వల్ల బయట శక్తులు ఇళ్లలోకి ప్రవేశించవని ఆదివాసీల అపారా నమ్మకం. ఆదివాసీల హోళీ అలా సాగితే గిరిజనుల్లోని లంబాడా సామాజిక వర్గంలో హోళీ మరింత విభిన్నంగా సాగుతుంది. ఓ వైపు పురుషులు.. మరోవైపు మహిళలు.. ఇద్దరి చేతుల్లో కర్రలు. ఇదేదో సంకుల సమరం కాదు. సంప్రదాయ గిరిజన హోలీ వేడుకల్లో ఒక దృశ్యం. పూర్వం గిరిజనుల్లో నేనావత్‌ వర్గానికి సంతానం కలగకపోవడంతో వారు హోలీ దేవతను మొక్కుకున్నారని.. అప్పుడు పిల్లలు పుట్టారని గాథ. నాటి నుంచి వీరు హోలీ వేడుకలు ఇలా ఘనంగా జరుపుకొంటారు. ఆదివాసీల ఆటపాటలు  నృత్యాలు అడవుల జిల్లాలో కన్నుల పండుగగా కనిపిస్తాయి.ఈ కార్యక్రమంలో పటేల్ సిడాం లక్ష్మీకాంత్, దేవరి పెందుర్ బండు, మహజన్ పెందుర్ అశోక్, యదోరావ్, సర్పంచ్ మేస్రం అమృతరావ్, సిడాం రాజేందర్ టీచర్, చిక్రం దేవురావ్, కనక జైవంత్ రావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!