‘కొత్త నాయకుడి’ వైపే కాంగ్రెస్ మొగ్గు
‘రాథోడ్’కు ఎంపీ టికెట్ ఆఫర్
త్వరలోనే పాలిటిక్స్ లో ‘ఐఆర్ఎస్ ఆఫీసర్’
కీలకంగా వ్యవహరిస్తున్న సీతక్క, కంది
‘ఆదిలాబాద్’లో విజయమే లక్ష్యంగా పావులు
-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నది. కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకొచ్చి విజయతీరాలకు చేరాలని భావిస్తున్నది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘కాంగ్రెస్ మీటింగ్’ లో ఈ విషయాన్ని పార్లమెంట్ ఇన్ చార్జిగా ఉన్న మంత్రి సీతక్క అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు చెందిన ఆఫీసర్ ప్రకాశ్ రాథోడ్ ను నిర్మల్ లోని ఆయన ఇంట్లో కలిసినట్లు సమాచారం. పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఐఆర్ఎస్ ఆఫీసర్ కూడా ఇంట్రెస్ట్ చూపుతుండడంతో.. దాదాపుగా ఆయనకే టికెట్ కన్ఫామ్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఫిబ్రవరిలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశమున్నది.

‘నిర్మల్ భేటీ’ అందులో భాగమే!
ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న సమయంలో జనవరి 10వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ చార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రకాశ్ రాథోడ్ ఇంటికి వెళ్లారు. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్ టికెట్ పైనే చర్చ జరిగినట్లు తెలిసింది. కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకొస్తే.. విజయతీరాలకు చేరవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని జనవరి 11న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ ఇన్ చార్జీల సమావేశంలో సీతక్క స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఏఐసీసీకి సమాచారం అందజేస్తామని చెప్పడం గమనార్హం.
కీలకంగా వ్యవహరిస్తున్న సీతక్క, కంది..
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించేందుకు మంత్రి సీతక్క తోపాటు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ కు పట్టు లేదనే మచ్చను తొలగించుకోవాలని భావిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏడు నియోజకవర్గాలు ఉండగా, నాలుగింటిలో బీజేపీ విజయం సాధించింది. రెండింటిలో బీఆర్ఎస్ నెగ్గగా.. కాంగ్రెస్ ఒక్క ఖానాపూర్ స్థానానికే పరిమితమైంది. ఓట్ల పరంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా లక్షల్లోనే ఉన్నది. దీంతో ఈ స్థానంలో విజయం సాధించడం కాంగ్రెస్ సవాలుగా తీసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ లో కీలక నేతగా ఎదుగుతున్న కంది శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క సహకారంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీల్లో వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
అనేక మంది ఆశావహులున్నా..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ టికెట్ కోసం పోటీ ఎక్కువగానే ఉన్నది. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నరేశ్ జాదవ్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి సభావత్ శ్రీనివాస్ నాయక్ తోపాటు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన చేరిక ఆగిపోగా.. ఎంపీ టికెట్ కోసమే ఆయన హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. బీజేపీలో ఆధిపత్య పోరు వల్ల తనకు టికెట్ దక్కని పక్షం లో.. ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు కూడా కాంగ్రెస్ టికెట్ పైనే ఆశలు పెంచుకున్నారు. అయితే వీరందరినీ పక్కన పెట్టి ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రకాశ్ రాథోడ్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments