Friday, November 22, 2024

యువత విద్య, వ్యవసాయంతోనే అభివృద్ధి చెందుతారు
జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

◾️జిల్లా పోలీస్ అధ్యక్షతన ఒక ఆదివాసి గ్రామాన్ని దత్తత తీసుకుంటాం.◾️ఆదివాసి యువత కు పోటీ పరీక్షల నిమిత్తం17 రకాల పుస్తకాలను అందజేస్తాం.◾️10 మంది జాతీయస్థాయిలో వివిధ రకాలైన పథకాలు, అవార్డులు సాధించిన విజేతలకు సన్మానం◾️నిర్మాన్ ఆర్గనైజేషన్ తో 25 గ్రూప్ వన్ పుస్తకాలను,గ్రామ ప్రజల సహకారంతో 25 కానిస్టేబుల్ పుస్తకాలను, జిల్లా పోలీస్ ద్వారా 25 వాలీబాల్ కిట్స్ ను అందజేత ◾️ఇచ్చోడా దుబార్ పెట్ గ్రామం నందు ఆదివాసి బిర్దు గొండ్ (తోటి)  యువ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
బుధవారం ఇచ్చోడ మండలంలోని దుబార్ పెట్ గ్రామం నందు నిర్వహించిన ఆదివాసి బీర్దుగోండ్ ( తోటి) యువ సమ్మేళనం మరియు పోలీసులు మీకోసం అనే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతించి, జిల్లా ఎస్పీ మరియు వెడుమ జయవంతరావు మహారాజ్  ద్వారా జ్యోతి ప్రజ్వలన  గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమం నందు తోటి వర్గానికి సంబంధించిన 19 గ్రామాల యువత,  ఆదివాసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ సభను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం అభివృద్ధి సాధించాలంటే గ్రామాలలో ఉన్న యువత విద్య, వ్యాపారం, వ్యవసాయం  రంగాలలో అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా ఆదివాసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని  తెలిపారు. చిన్నతనం నుండి యువతకు విద్యపై ఆసక్తి కలిగేలా భవిష్యత్తు గురించి పెద్దలు సవివరంగా వివరించాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితమైన లక్ష్యం ఏర్పాటు చేసుకోని లక్ష్యసాధన దిశగా కృషి చేస్తూ తమకు సాధ్యమైనంత వరకు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని యువతకు సూచించారు. విద్య ఒక్కటే తమ వర్గాన్ని, ఆదివాసీలను అభివృద్ధి వైపు తీసుకు వెళుతుందని తెలియజేశారు. విద్య లేని పక్షాన వ్యాపార రంగంలో కానీ, నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయాన్ని చేస్తూ గ్రామంలోని ప్రతి ఒక్క యువత ఏదైనా ఒక పని చేస్తూ అభివృద్ధిని సాధించాలని సూచించారు. జిల్లా పోలీసు తరపున ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సరైన పద్ధతిలో విద్యపై అవగాహన కల్పిస్తూ, ఉపాధి మార్గాన్ని తెలియజేస్తూ అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా పదిమంది జాతీయస్థాయిలో అవార్డులను, పథకాలను సాధించిన తోటి ప్రజలను విద్యార్థులను శాలువా తో సత్కరించి బహుమతి ప్రధానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా నిర్మన్ ఆర్గనైజేషన్ సహకారంతో 25 మంది విద్యార్థులకు 16 పుస్తకాలతో కూడిన గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. గ్రామస్తుల సహకారంతో 25 మందికి కానిస్టేబుల్ పరీక్షకు ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు 15 పుస్తకాలతో కూడిన సెట్లను అందజేశారు, అదేవిధంగా జిల్లా పోలీసుల ద్వారా 25 గ్రామాలకు 25 వాలీబాల్ కిట్లను అందజేశారు. త్వరలో జిల్లా పోలీసుల తరఫున ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఆదివాసీలకు ఒక్కొకరికి 17 రకాల పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. ముఖ్యంగా యువత విద్యను మధ్యలో విడిచి పెడుతూ గ్రామాల లో ఉంటూ జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వెసులుబాటును ఉపయోగించుకొని ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డిఎస్పి సిహెచ్ నాగేందర్, సీఐ ఎం నైలు, వెడ్మ జీవంతరావు మహారాజ్, ఏజెన్సీ డిఎం & హెచ్ ఓ మనోహర్, సంఘ అధ్యక్షుడు నారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి