
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: సిరికొండ మండలంలోని లచింపూర్(బి) గ్రామంలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్, శాస్త్రవేత్తలు, ఉద్యాన శాస్త్రవేత్త, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యానవన అధికారి, మాజీ ఎం.పి.పి., మాజీ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీతో పాటు అధిక సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డా. శ్రీధర్ చౌహాన్, అసోసియేట్ డీన్, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్ మాట్లాడుతూ, వ్యవసాయంలో తక్కువ యూరియా వాడకం, అవసరానికి తగిన రసాయన మందుల వినియోగం, ఎరువులు, పురుగుమందులు, గడ్డిమందుల రసీదుల భద్రపరచడం, సాగునీటి సంరక్షణ, పంటల మార్పిడి విధానం, చెట్ల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ వంటి ఆరు కీలక అంశాలపై చర్చించారు.
డా. వి. మురళి, సీనియర్ శాస్త్రవేత్త (ఉద్యానవన శాస్త్రం), ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల, ఆదిలాబాద్, ఉద్యానవన పంటల సాగు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కూరగాయల సాగు, ఆయిల్ పామ్ సాగు విధానాల గురించి వివరించారు. అలాగే, ఉత్తమంగా సాగు చేస్తున్న ఉద్యానవన క్షేత్రాలను సందర్శించి, సాగు విధానాలను నేర్చుకోవాలని సూచించారు.
డా. డి. కుమారస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (వ్యవసాయ ఆర్థిక శాస్త్రం), వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న విస్తరణ కార్యక్రమాలు, టీవీ, వార్తాపత్రికలు, రేడియో, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నూతన సమాచారం తెలుసుకునే విధానాలను వివరించారు. అలాగే, తక్కువ సాగు ఖర్చుతో అధిక నికర లాభాలు పొందే ఆవశ్యకతను గుర్తు చేశారు.
మండల వ్యవసాయ అధికారి ఆర్. శ్రద్ధారాణి, వ్యవసాయంలో అనుసరించాల్సిన సాంకేతిక పద్ధతులు, ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు, స్కీముల గురించి తెలియజేశారు. మండల ఉద్యానవన అధికారి కె. క్రాంతి కుమార్, పంటలకు అందుబాటులో ఉన్న రాయితీలు, పథకాల గురించి వివరించారు.
తదనంతరం, గ్రామ పెద్దలు రైతుల అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు అందించారు. రైతులు, అధికారులు, శాస్త్రవేత్తల మధ్య ఫలవంతమైన చర్చ జరిగింది. రైతులు అడిగిన సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానాలు అందించారు. కార్యక్రమం ముగింపులో రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.


Recent Comments