స్వామి వివేకానందా (swamy vivekananda) జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆదిలాబాద్ (adilabad ) జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద 161 జయంతి సందర్బంగా జడ్పి సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ National youth day కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందా అని కొనియాడారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని, యువతరాన్ని ఉత్తేజపరిచి లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించవద్దని యువతకు పిలుపునిచ్చారు. ఉన్నత చదువులు చదివి దేశానికి, సమాజానికి ఉపయోగపడాలని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులందరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వంద శాతం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమానికి హాజరైన యువతీ యువకులు, అధికారులతో ఓటు హక్కు నమోదు పై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా యువత ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆహ్వానితులను అలరించాయి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, మెమొంటోలను ప్రధానం చేశారు. అనంతరం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వివిధ స్టాల్ లను కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్థానిక వివేకానంద చౌక్ లోని విగ్రహం వద్ద స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్, యువజన సంఘాల ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, కళాకారులు, యువజన సంఘాల ప్రతినిధులు, అధికారులు, యువత, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments