చెట్టుకొమ్మనే వంతెనగా మార్చి సాహసం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలోని బజార్హత్నూర్ మండల పరిధిలోగల కొత్తపల్లి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక మట్టి రోడ్డు పైనే రాకపోకలు కొనసాగించే గ్రామస్తులకు వర్షాకాలం వచ్చిందంటే చాలు… బాహ్యప్రపంచంతో గ్రామానికి సంబంధం తెగిపోతుంది. వాగు పై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గ్రామస్తులు సమీప వాగును దాటాలంటే చెట్టు కొమ్మని ఆసరాగా చేసుకుని మూటముల్లె, నెత్తిన పెట్టుకొని అతికష్టం మీద వాగు దాటి వెళ్తారు .

పట్టుకున్న చెట్టుకొమ్మ జారితే వాగులో పడిపోవాల్సిందే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేవుడా నీవే దిక్కు అని వాగును దాటుతుంటే వారి పరిస్థితి చూస్తే వర్ణనా తీతంగా ఉంది . మండల కేంద్రానికి సుమారు 4 కిలోమీటర్ దూరంలో ఈ గ్రామం ఉంది. ఎన్ని సార్లు ఆ గ్రామస్తులు తమ సమస్యను అధికారులకు చెప్పుకున్నప్పటికీ ఇప్పటిదాకా వారి సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి రోడ్డు కూడా భారీ వర్షాలకు తెగిపోయి అక్కడక్కడ కోతలు ఏర్పడ్డాయి. సాధారణమైన సమయంలో నే తమ కష్టాలు ఈవిధంగా ఉన్నాయని భారీ వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తమ పరిస్థితి ఏమిటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Recent Comments