★ రైతుబీమా వచ్చిన తర్వాత
49,755 మంది మరణం
★ గత ఏడాది 4వ స్థానంలో తెలంగాణ
★ లెక్కల్లో తేడాలు ఎందుకు.?
( పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు,
‘రైతు ఆత్మహత్యల ‘ పై అందిస్తున్న ప్రత్యేక కథనం)
రైతులకు రైతుబందు ఇస్తున్నారు. ఇంకెన్నో చేస్తున్నాం అంటుంది ప్రభుత్వం. అయినా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగటం లేదు. దేశ రైతల ఆత్మహత్యల జాబితాలో తెలంగాణ 4వ స్థానం ఉన్నట్లు నివేదికలు చెపుతున్నాయి. రాష్ట్రంలో కూడా అన్నదాతల ఆత్మహత్యలపై ప్రభుత్వం చెపుతున్నా దానికి, దేశంలో ఆత్మహత్యలపై నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక లెక్కలకు పొంతన ఉండటం లేదు. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి.?
గురువారం ఉత్తర్వుల్లో..:
రైతుల ఆత్మహత్యలపై తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వెరిఫికేషన్ లాంటి చర్యలకు ఉపక్రమించాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్ లాంటి పథకాలు వచ్చాక రైతుల ఆత్మహత్యలు బాగా తగ్గిపోయాయని, గతం కంటే పరిస్థితి మెరుగైందని పేర్కొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యల విషయంలో అరుదైన కేసుల్లో మాత్రమే వెరిఫికేషన్ లాంటి ప్రక్రియను చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు తాజా సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
తేడా ఎందుకు..? నిజాలు చెప్పండి.:
రైతు సంఘాలు, స్వచ్చంద సంస్థలు మాత్రం రైతుల ఆత్మహత్యల వివరాలను సేకరిస్తూ కారణాలను విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికీ తెలంగాణలో ఆత్మహత్యలు గణనీయంగానే జరుగుతున్నట్టు రైతు స్వరాజ్య వేదిక పేర్కొన్నది. గతేడాది 685 మంది రైతులు చనిపోయారని వ్యాఖ్యానించింది. అంతకుముందు దాదాపు వెయ్యి మందికి పైగా చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 468 మంది చనిపోయినట్టు పేర్కొన్నది.
ప్రభుత్వం ఒకవైపు ఇలా..:
రైతుబీమా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది మే చివరి వరకు రాష్ట్రంలో సుమారు 49,755 మంది రైతులు చనిపోయారని, వారికి బీమా పరిహారం అందినట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఏ కారణం చేత చనిపోయినా బీమా పరిహారం అందుతూ ఉన్నందున నిర్దిష్ట కారణాన్ని ప్రభుత్వం వెల్లడించడం లేదు. దీంతో రైతుది సహజ మరణమా? లేక ఆత్మహత్యా? అనే వివరాలు వెలుగులోకి రాకుండా పోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అరుదైన కేసుల్లో మాత్రమే త్రిసభ్య కమిటీలో ఒక సభ్యుడిగా జిల్లా వ్యవసాయ అధికారిని నియమిస్తే సరిపోతుందంటూ జిల్లా కలెక్టర్లకు రాసిన సర్క్యులర్‌లో వ్యవసాయ కమిషనర్ పేర్కొన్నారు.
ఇవిగో నిజాలు:
తెలంగాణలో 2018లో 908, 2017లో 851 రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. రికార్డుల ప్రకారం… 2019లో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న 499 మంది రైతుల్లో సొంత భూమి ఉన్నవారు 373 మంది, కౌలు రైతులు 118 మంది, రైతు కూలీలు ఎనిమిది మంది ఉన్నారు. ఇదిలా ఉండగా..దేశంలోని జరుగుతున్న మొత్తం ఆత్మహత్యల్లో సుమారు 7.4 శాతం మంది రైతులే ఉన్నారన్న విషయం ఈ తాజా నివేదిక ద్వారా అర్థమవుతోంది.
దేశంలో 10,281 ఆత్మహత్యలలో 5,957 మంది రైతులు కాగా 4,324 రైతు కూలీలు ఉన్నారు.
విషాద ముగింపు ఏమిటంటే..!
2014 నుంచి 2018 వరకు 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు రైతు స్వరాజ్య వేదిక చెపుతుంది.
( పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు,
‘రైతు ఆత్మహత్యల ‘ పై అందిస్తున్న ప్రత్యేక కథనం)
Recent Comments