Wednesday, February 12, 2025

ధరణి సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఎంపీ కోమటిరెడ్డి లేఖ…

రిపబ్లిక్ హిందూస్థాన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమల్లోకి తెచ్చిన “ధరణి పోర్టల్” తరతరాలుగా భూ వివాదాలతో సతమతమవుతున్న రాష్ట్ర రైతాంగం యొక్క పాత సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెచ్చి పెట్టిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

“కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిపోయినట్లుగా!!…” అన్నదాతల భూ వివాదాలను మరింత క్లిష్టతరం చేసిన ధరణి అభాసుపాలవుతోందని అన్నారు.

ధరణి పోర్టల్ ను అమల్లోకి తెచ్చి దాదాపుగా 11 నెలలు కావొస్తోంది. ఈ 11 నెలల్లో ధరణిలోని నిషేధిత జాబితాలో చేర్చబడ్డ భూములను తొలగించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య సుమారుగా 1 లక్ష వరకు ఉన్నదని అన్నారు.

ఇంత పెద్ద సంఖ్యలో రైతుల నుంచి అర్జీలు రావడంతో ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమేరకు దృష్టిసారించిందో అర్థం కావడంలేదని అన్నారు.

రాష్ట్ర రైతాంగం యొక్క భూ సమస్యలను పరిష్కరించడంలో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న “ధరణి పోర్టల్”లోని అనేక కొత్త సమస్యలకు కారణమవుతున్న మూలాల్లోకి వెళ్తే…..

2007 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ౼ 22A లో నిషేధిత జాబితాలో పట్టా భూములను చేర్చింది. 2007 నుండి ఇప్పటివరకు రకరకాల కారణాలతో దాదాపు 20 లక్షల ఎకరాల పట్టభూమిని నిక్షిప్తం చేసింది. వివాదరహితంగా ఉన్నటువంటి పట్టా భూములకు సంబంధించిన కొన్ని వేల సర్వే నెంబర్లను కూడా రిజిస్ట్రేషన్ శాఖ తీవ్ర నిర్లక్ష్యంతో సెక్షన్ ౼ 22A లో చేర్చిందని అన్నారు.

2007౼08 సంవత్సరాల్లో అప్పుడు విధి నిర్వహణలో ఉన్నటువంటి తహశీల్దార్లు, దేవాదాయ శాఖ అధికారులు, వక్ఫ్ బోర్డ్ అధికారులు అప్పటి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు చెప్పి వివిధ కారణాలతో కొన్ని లక్షల ఎకరాల పట్టా భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ౼ 22A కు సంబంధించిన నిషేధిత జాబితాలో చేర్పించి ఇప్పటి ధరణి సమస్యలకు బీజం వేశారు.

20 లక్షల ఎకరాల భూమిని, కొన్ని వేల సర్వే నెంబర్లను నిక్షిప్తం చేసుకున్న సెక్షన్ ౼ 22A రెగ్యులర్ గా అప్ డేట్ అవ్వట్లేదు. ఇలా అప్ డేట్ కాకపోవడమే ధరణి ద్వారా ఉత్పన్నమవుతున్న అనేక చిక్కుముళ్ళకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రిజిస్ట్రేషన్ చట్టం లోని సెక్షన్ ౼ 22A ను అప్ డేట్ చెయ్యాలి. అలా చేస్తే ధరణి ద్వారా పుట్టుకొచ్చిన అనేక కొత్త సమస్యలలో దాదాపు 50% సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉన్నదని భూ చట్టాల నిపుణులు, రైతుల తరపున అవిశ్రాంతంగా పోరాడుతున్న ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నారని అన్నారు.

రిజిస్ట్రేషన్ చట్టం లోని సెక్షన్ ౼ 22A ను అప్ డేట్ చెయ్యకుండా…”తలకు దెబ్బ తగిలితే మోకాలికి చికిత్స చేసినట్టు” ప్రభుత్వం ధరణి సమస్యల మూలకారణాన్ని అన్వేషించకుండా కేవలం తాత్కాలిక పరిష్కారం దిశగా ఆలోచిస్తూ 2 రోజుల్లో ధరణి సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను అనాలోచితంగా ఆదేశించడం రైతులను విస్మయానికి గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చెయ్యాలని అన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి