Tuesday, November 11, 2025

మోడీ కీలక నిర్ణయం.. సందేశ్‌ఖాలీ బాధిత మహిళలతో భేటీ!

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోడీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఆయా రాష్ట్రాల్లో తిరుగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ బిజిబిజీగా గడుపుతున్న ప్రధాని..

తాజాగా సందేశ్‌ఖాలీ బాధితులను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఆందోళనలతో అట్టుడుకుతోంది. తమపై అత్యాచారం జరిగిందంటూ కొందరు మహిళలు బహిరంగంగా ఆరోపించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా బీజేపీ నేతలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ఆందోళనల్లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా ఆ బాధిత మహిళలను పరామర్శించాలని మోడీ డిసైడ్ అయ్యారు.

ప్రధాని మోడీ మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సందేశ్‌ఖాలీ బాధిత మహిళలను కలవనున్నట్లు తెలుస్తోంది. మార్చి 6న బరాసత్‌ (Barasat)లో బీజేపీ (BJP) మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో మోడీ పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్‌ తెలిపారు. ఒకవేళ సందేశ్‌ఖాలీలోని మాతృమూర్తులు, సోదరీమణులు ప్రధానిని కలవాలనుకుంటే అందుకు ఏర్పాటు చేస్తామన్నారు.

ఇక ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. బీజేపీ నిరసనకారులను రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు. మరోవైపు ఈ ఘటనను కలకత్తా హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, భూములు ఆక్రమించారని స్థానిక మహిళలు ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. బాధిత మహిళలకు మద్దతుగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హింస చెలరేగడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు.

అనంతరం బాధితులను కలిసేందుకు వెళ్తుండగా చోటుచేసుకున్న ఘర్షణల్లో బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ గాయపడ్డారు. దీంతో ఆయన లోక్‌సభ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రివిలేజెస్‌ కమిటీ.. పశ్చిమబెంగాల్‌ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌, బీజేపీ ఎంపీ సుకాంత, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఈ హింసలో ప్రధాన నిందితుడుపరారీలో ఉన్న షాజహాన్‌ షేక్‌ను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం విస్మయం కలిగిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్‌.శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడిని రక్షిస్తున్నారా లేదా అన్న విషయం తెలియదు కానీ, అతడిని మాత్రం ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదని ప్రభుత్వానికి గుర్తుచేసింది.

తాజాగా ప్రధాని మోడీ బాధిత మహిళలను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఇష్యూ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!