◾️ హోలీ దంగల్ కేరాఫ్ బజార్ హత్నూర్ ◾️ తరతరాల ఆచారం, పెద్దల నుండి వస్తున్న సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూ అదిలాబాద్ జిల్లాలో ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న గ్రామం బజార్ హత్నూర్. ◾️తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని మట్టెద్దుల జాతరైన, హోలీ సందర్భంగా నిర్వహించే మల్లయుద్దమైన బజార్ హత్నూర్ గ్రామానికి పెట్టింది పేరు.
హిందూ సంస్కృతీ సంప్రదాయాలను, ప్రతీ పండగను తారతమ్యం లేకుండా గ్రామస్థులంతా కలిసి ఎంతో వైబవంగా జరుపుకుంటారు. వ్యవసాయ ఆధారిత గ్రామం కావడంతో ప్రజలంతా కలిసిమెలిసి ఉంటారు. గ్రామానికి మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలతో పూర్వం నుండి సత్సంబంధాలు కలిగి ఉండటంతో అక్కడి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రభావం గ్రామంపై మెండుగా ఉంటాయి. దానికి కొనసాగింపుగా మహారాష్ట్ర వాసుల ఆరాధ్య దైవం అయిన విఠలేశ్వర ఆలయం కూడా గ్రామంలో ఉంది.
ఇక విషయానికి వస్తే హోలీ సందర్భంగా నిర్వహించే కుస్తీ పోటీలు ఈ గ్రామానికి మరింత వన్నె తెచ్చాయి.
సరైన ఆధారాలు లేవు గానీ గ్రామస్థుల వివరాల ప్రకారం పూర్వం నుండి తమ గ్రామంలో హోలీ పండగ సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నామని, అది మా గ్రామ సంప్రదాయంగా మారిపోయిందని అంటారు.
దంగల్ క్రేజ్ ప్రేక్షకుల కేరింతలు....చెవులు దద్దరిల్లేలా బాజా భజంత్రీల చప్పుళ్లు..
నువ్వా.....నేనా అంటూ సవాల్....
ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి ఉత్కంఠ రేకెత్తించి ప్రతి ఒక్కరినీ ఉర్రూతలూగించే ఆట కుస్తీ.
క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, వంటి టోర్నీలు జరుగుతుంటే టీవీలకు అతుక్కుపోయే నేటి రోజుల్లోనూ కుస్తీ పోటీలకు క్రేజ్ తగ్గలేదు.
హోలీ వచ్చిందంటే బజార్ హత్నూర్ లో కుస్తీ పోటీల సందడి మొదలవుతుంది. ఈ కుస్తీ పోటీలకు స్థానికులతోపాటు, ఇతర జిల్లాల నుండి, మహారాష్ట్ర నుండి మల్లయోదులు వస్తుంటారు.
మొదటగా కొబ్బరి కాయ తో మొదలైన కుస్తీ పోటీలు 50 వేల రూపాయల వరకు కొనసాగుతాయి.
కొబ్బరి కాయ ఎందుకంటే గ్రామంలో మల్లయోదుల్ని తయారు చేసేందుకు చిన్నపిల్లలను ప్రోత్సహించేందుకు గెలిచిన పిల్లలకు కొబ్బరి కాయ ఇస్తారు. అది శుభానికి సూచికగా మల్ల యుద్దయోదుడుగా తయారయ్యేoదుకు తొలి మెట్టుగా భావిస్తారు.
ఆతర్వాత ప్రైజ్ మనీ పెంచుకుంటూ వెళ్తారు.
ఈ పోటీల్లో పాల్గొనే మల్ల యోధులకు కండబలం కంటే నైపుణ్యత చాలా అవసరo అందుకే సమయ స్ఫూర్తి, నైపుణ్యత తో ఎదుటివారిని చిత్తు చేస్తుంటారు.
ఈ పోటీల్లో మహారాష్ట్ర ప్రాంతాలనుండి అమ్మాయిలు కూడా పాల్గొనడం విశేషం.
గ్రామస్థుల సహకారం తరాలు మారినా, పాలకులు మారినా కుస్తీ పోటీలను మాత్రం ఆపకుండా కొనసాగిస్తూనే ఉండటానికి ప్రధాన కారణం గ్రామస్థుల సహకారమే. ఈ కుస్తీ పోటీలకు కావాల్సిన ఆర్థిక సహాయం గ్రామంలోని వ్యాపారులు, గ్రామపెద్దలు, కొంతమంది నాయకులు వారికి తోచిన సహాయాన్ని అందించి సంప్రదాయాన్ని కాపడుతున్నారు.
పోటీలో పాల్గొనే మల్ల యోధులతో పాటు తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తారు.
ఈ పోటీలను తిలకించేందుకు వివిధ ప్రాంతాలనుండి ప్రజలు తరలివస్తారు. గ్రామమంతా కేరింతలతో సందడి నెలకొంటుంది.
ఏదేమైనా తరతరాల ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తూ బజార్ హత్నూర్ గ్రామస్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
– గాజుల రాకేష్,
సెల్ నెం. 9951439589.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments