మొన్నటి వరకు భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలో అత్యంత భారీ వర్షాలతో ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా సంభవించింది.
అయితే ఈ జిల్లాలను ఇంకా వర్షాలు వదలడం లేదు. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కుంభ వృష్టి వర్షం కురిసింది. దీంతో ఈ జిల్లాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
శనివారం సాయంత్రం నుంచి మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన అత్యంత భారీ వర్షం పడింది. బయ్యారం లోని జగ్న తండా నీటిలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు భయపడిపోతున్నారు. మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, గార్ల, బయ్యారం మండలాల్లో కుంభవృష్టి వర్షం పడింది.
మహబూబాబాద్ పట్టణంలో దాదాపు రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ చెరువులుగా మారాయి.ఖమ్మం జిల్లాలోభారీ వర్షాలతో మున్నేరు వాగుకు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రభుత్వం కూడా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.
ప్రజల ఎవరూ భయపడొద్దని చెప్పారు. ఖమ్మం జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. అత్యవసరం అయితే 1077 ఫోన్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.
Recent Comments