Friday, June 20, 2025

ఏజెన్సీ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సివిల్ కోర్టుల విస్తరణ నోటిఫికేషన్ జి.ఓ.లు చెల్లనేరవు

*ఏజెన్సీ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సివిల్ కోర్టుల విస్తరణ నోటిఫికేషన్ జి ఓ లు చెల్ల నేరవు*
*గౌ.హైకోర్టు నందు ఆదివాసి సేన  సంఘం వారు వేసిన కేసులో తుది తీర్పు వెల్లడించినట్లు తెలిపిన ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి

ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గల ఉమ్మడి జిల్లాలను విభజిస్తూ 33 రెవిన్యూ జిల్లాలుగా ఉన్నతీకరించినది. అందులో భాగంగా 2022 సంవత్సరంలో 33 జిల్లాలకు అనుగుణంగా ఆయా జిల్లాలలోని ఏజెన్సీ ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాలకు సివిల్ కోర్టుల చట్టంను వర్తింప చేయుటకు  రాష్ట్ర ప్రభుత్వం వారు నోటిఫికేషన్ల ద్వారా పలు జి ఓ లను   జారీ చేశారు.
ఆ తర్వాత అవే జి ఓ లకు అమెండ్మెంట్ లు తీసుకు వస్తూ మరి కొన్ని  జి ఓ లను నోటిఫికేషన్ల ద్వారా జారీ చేశారు.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో  జిల్లా కోర్టు పరిధిలో జారీ చేసిన నోటిఫికేషన్ జి ఓ లో మాత్రం ఏజెన్సీ ప్రాంతం నుండి మినహాయింపు అని ఇచ్చినప్పటికీ మిగతా కింది స్థాయి కోర్టుల పరిధి విషయంలో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇట్టి విషయాన్ని ఆదివాసి సేన సంఘం వారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన్నప్పటికి అధికారుల నుండి ఎలాంటి స్పందన రాక పోవడంతో తప్పనిసరి పరిస్థితులలో వేరే మార్గం లేక  ప్రముఖ హైకోర్టు న్యాయవాది సి.హెచ్. రవి కుమార్  ద్వారా గౌ.హైకోర్టు నందు కేసు దాఖలు చేశారు. గౌరవ హైకోర్టు వారు కేసును ఆమోదించి ప్రభుత్వ అధికారులను వెంటనే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కోర్టు వారి నోటీసులకు కూడా అధికారులు సరియైన సమయంలో స్పందించకపోవడంతో ఆగ్రహించిన కోర్టు వారు స్పందించని అధికారులకు రూ.10000/- (రూ . పది వేలు మాత్రమే) జరిమాన విధిస్తూ అట్టి డబ్బులు పిటిషనర్ కు చెల్లించాలని ఆదేశించారు. ఇట్టి కేసులో పిటిషనర్ తరఫు న్యాయవాది  సీ.హెచ్. రవి కుమార్ గారు ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక కోర్టులకు సంబంధించిన 1874 షెడ్యూల్ జిల్లాల చట్టం మరియు తెలంగాణా ఏజెన్సీ రూల్స్ చట్టం 1924 గురించి కోర్టు వారికి వివరిస్తూ బలమైన వాదనలు వినిపించారు.

ఏదైతే సివిల్ కోర్టుల చట్టం 1972 ఉందో అందులోనే సబ్ సెక్షన్ 1(3)  చట్టం ఏజెన్సీ ప్రాంతాలకు వర్తించదని స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఉద్దేశ్యపూర్వకంగా ఆ జీ ఓ లను జారీ చేశారని, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత పరిరక్షణకు మరియు వివాదాల  పరిష్కారానికి పైన తెలిపిన ప్రత్యేక కోర్టులకు సంబంధించిన చట్టాలు ఉన్నప్పటికి వాటిని కాదని అన్ని ప్రాంతాలకు వర్తించే విధంగా జి ఓ లు తీసుకు రావడం ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 244కు విరుద్ధం అవుతుందని మరియు  అన్యాయం, నిరంకుశ వ్యతిరేక ఆర్టికల్స్ అయిన 14,19 మరియు 21 ల ఉల్లంఘన జరిగినట్లు అవుతుందని, ఆ ప్రాంత గిరిజనులకు ఇది తీవ్ర హాని చేసినట్లవుతుందని, ఇది భవిష్యత్తులో గిరిజనులకు పూడ్చలేని నష్టం కలిగించే విధంగా ఉంటుందని కోర్టు వారికి వివరించగా వాదనలు విన్న కోర్టు వారు ప్రభుత్వాధికారులకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించగా తమ తప్పును ఒప్పుకుని  జరిగిన పొరపాట్లకు గౌరవ కోర్టు వారు ఆదేశించిన విధంగా ఆ జి ఓ లను సరి చేసుకుంటామని లేదా ఫ్రెష్ నోటిఫికేషన్లు జారీ చేస్తామని గౌ.కోర్టు వారికి తెలియజేయటం జరిగినది.

ఏ చట్ట విస్తరణ కైతే నోటిఫికేషన్ లు జారీ చేశారో అదే చట్టంలో ఏజెన్సీ ప్రాంతాలకు ఈ చట్టం చెల్లదు  అని స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారులు దానిని పట్టించుకోక పోవడం శోచనీయమని, మరియు ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు ఉద్దేశ్య పూర్వకంగానే ఈ జి ఓ లు జారీ చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయని పిటిషనర్ ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత చట్టాలను గౌరవించి వాటిని అమలు పరచే దిశగా ప్రయత్నించాలని లేని ఎడల ఏజెన్సీ ప్రాంతం మొత్తం వినాశ నానికి గురై ఆదివాసుల ఉనికి అస్థిత్వం కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక చట్టాలకు అతీతంగా ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు ఏ మాత్రం వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినా అట్టి వారికి వ్యతిరేకంగా ఇక నుండి చేసిన పొరపాట్లకు తగిన శిక్ష పడే వరకు న్యాయ బద్దంగా చట్టబద్ధంగా తీవ్ర ఆందోళనలు ఉద్యమాలు చేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల రక్షణ కొరకు సమస్యల పరిష్కారం కొరకు, అభివృద్ది కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక చట్టాలను ప్రభుత్వాలు తప్పకుండా అమలు పరచాల్సిందే నని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ఏజెన్సీ ప్రాంత పరిరక్షణకు మరో కుంరం భీం లా ఉద్యమాలకు పూను కుంటామని ఆయన హెచ్చరించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి