📰 ప్రజలందరూ ఒకటై అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుందాం
📰 గణపతి ఉత్సవ కమిటీలు మరియు ఇరు మత పెద్దలతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశం
📰 గణేష్ మండపాల వద్ద, శోభయాత్ర సమయంలో సౌండ్ డీజే లకు అనుమతి లేదు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఆదిలాబాద్ పట్టణంలో అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు కలసికట్టుగా పట్టణ ప్రజలు కొనసాగిస్తున్న తీరు,ఘనత అద్భుతమని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి కొనియాడారు. శనివారం స్థానిక హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు హిందూ మత పెద్దలు ముస్లిం మత పెద్ద సమక్షంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హిందూ ఉత్సవ సమితి సభ్యులు తమ సమస్యలను తెలియజేశారు. రోడ్ల మరమ్మత్తులు, విద్యుత్తు, శోభాయాత్ర సమయంలో ఉండే సమస్యలపై చర్చించారు. అలాగే ముస్లిం మత పెద్దలు పండుగలను సామరస్యంగా నిర్వహించుకుందామని తెలిపి, పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క గణేష్ మండలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అదేవిధంగా రాత్రిపూట కచ్చితంగా గణేష్ మండపం వద్ద ఇద్దరు కమిటీ సభ్యులు కానీ వాలంటీర్లు గాని ఉండే విధంగా చూసుకోవాలని తెలియజేశారు. శోభాయాత్ర సమయంలో ఎక్కువగా శబ్దం వచ్చే డీజే లకు అనుమతి లేదు అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మండప వివరాలను, శోభాయాత్ర, నిమర్జనం తేదీ, మండప సభ్యులు, కమిటీ సభ్యులు, తదితర వివరాలను http://policeportal.tspolice.gov.in ఈ వెబ్సైట్ నందు పొందుపరిచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి స్థానిక మత పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, యువజన సంఘాలు, గణేష్ మండలి నిర్వాహకులు పోలీసులకు ఎల్లవేళలా సహకరించాలని కోరారు.

అదేవిధంగా కమిటీ సభ్యులు సూచించిన కొన్ని సూచనలను జిల్లా ఎస్పీ వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూ, నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో మరియు ఆదిలాబాద్ పట్టణంలో పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఎటువంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 కు సంప్రదించవచ్చునని, ఫోన్ చేసిన ఐదు నిమిషాల లోపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి ఉమెంధర్, పట్టణ సిఐలు పి సురేందర్, కే శ్రీధర్, ఆర్ ఐ లు డి వెంకటి,ఎం శ్రీపాల్, మున్సిపాలిటీ ఈఈ తిరుపతి, టిపిఓ అరుణ్, హిందూ మరియు ముస్లిం మత పెద్దలు, గణపతి మండప కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments