Saturday, March 15, 2025

డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు : డిఐజి రంగనాధ్

  • – మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దు…
  • – టిటిఐలో కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించిన ఎస్పీ రంగనాధ్…
  • – ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా కృషి….

నల్లగొండ : మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో ఒక వ్యక్తి చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డిఐజి ఏ.వి. రంగనాధ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో మొదటిసారిగా మధ్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ప్రక్రియను, రోడ్డు ప్రమాదాల వీడియోలను మద్యం సేవించి పట్టుబడిన వారికి చూపించి వారికీ అవగాహన కల్పించడాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కువ మోతాదులో మద్యం సేవిస్తే శిక్ష సైతం ఎక్కువగానే ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పెద్ద నేరం చేసినట్లుగా భావించాల్సిన అవసరం లేదని, అదే సమయంలో మనలను మనం రక్షించుకోవడం, ప్రమాదాలకు కారణమవుతున్న విషయాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కౌన్సిలింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్యను క్రమంగా తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం టిటిఐ ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు. మన జిల్లాలో రోజుకు ఒక వ్యక్తి చనిపోతున్నాడని, అలాగే రోజుకు ఇద్దరు రోడ్డు ప్రమాదాల వల్ల పూర్తిగా అంగవైకల్యానికి గురవుతున్నారని, దీని కారణంగా రోజుకు మూడు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అందరిలో రోడ్డు ప్రమాదాల విషయంలో ఒక ఆలోచన రేకెత్తించడం ద్వారా వారు మిగిలిన వారికి అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రతిజ్ఞ చేస్తున్న వాహన చోదకులు

మద్యం సేవించడం తప్పు కాదని, అదే సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని చెప్పారు. మద్యం సేవింవి వాహనాలు నడపడం వల్ల చిన్న, చిన్న తప్పులకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. డ్రైవింగ్ చాలా ముఖ్యమైన ప్రక్రియ అని, ఎంతో శ్రద్ధ, ఏకాగ్రతతో వాహనం నడపాల్సిన అవసరమున్నదని తెలిపారు. సేవించిన మద్యం శరీరంలోకి వెళ్లి రక్తంలో త్వరగా కలిసిపోయి మెదడు వరకు చేరి మెదడు పనితీరు మార్పు, విచక్షణ జ్ఞానం కోల్పోయేలా చేస్తుందని చెప్పారు. మనల్ని మనం కాపాడుకుంటూ, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులపై ప్రేమ ఉంటే మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను మరింత ముందుకు తీసుకెళ్లి మంచి కౌన్సిలింగ్ సెంటర్ గా తీర్చిదిద్దాలని పోలీస్ అధికారులకు సూచించారు.
అనంతరం మద్యం సేవించి వాహనాలు ఎట్టి పరిస్థితులలో నడపమని, హెల్మెట్, బెల్ట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న తప్పుల కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మైనర్లకు వాహనాలు ఇస్తే వారికి వాహనం ఇచ్చిన వారిపై, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒక మంచి ఉద్దేశ్యంతో కౌన్సిలింగ్ కు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ఇప్పటివరకు హైదరాబాద్ లాంటి నగరాలలో మాత్రమే ఉన్న విధానాన్ని జిల్లాలో ప్రారంభించామని తెలిపారు. కుటుంబ సభ్యులు చైతన్యం చేసే లక్ష్యంతో కుటుంబ సభ్యులను పిలవడం జరిగిందని చెప్పారు.

కార్యక్రమంలో కార్యక్రమంలో డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, డిఎస్పీలు సురేష్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సిఐలు చీర్ల శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బాలగోపాల్, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, సంతోష్, ట్రాఫిక్, టిటిఐ సిబ్బంది, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి కుటుంబ సభ్యులు, సంరక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి