ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం, సోమవారం గర్భిణీ స్త్రీలకు సేవలు సున్నా…
వికారాబాద్,ప్రతినిధి,(రిపబ్లిక్ హిందుస్థాన్): బషీరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు కరువయ్యాయి. గర్భిణీ స్త్రీల పేర్లు నమోదు చేసుకోవడం తప్ప వైద్యం అందించే దాఖలాలు లేవు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య అధికారిణి కి జిల్లా ప్రోగ్రాం అధికారి గా బాధ్యతలు అప్పగించడంతో వారు జిల్లా కే పరిమితమయ్యారు. ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం, సోమవారం గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు తప్పనిసరిగా అందించాలని వైద్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా కానీ ఇక్కడ మాత్రం వైద్య సేవలు అందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ లో భాగంగా డాక్టర్ల సమక్షంలో వారి ఆదేశానుసారం ల్యాబ్ టెక్నీషియన్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్, విడిఆర్ఎల్, బ్లడ్ గ్రూపింగ్, హెచ్ఐవి, మలేరియా వంటి మొదలగు పరీక్షలు తప్పనిసరిగా చేసి వారికి అవసరమగు మాత్రలు, ఔషధాలు అందించాలి అదేవిధంగా ఆరోగ్య నియమావళిని అనుసరించి అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
ఇక్కడ మాత్రం వైద్య పరీక్షలు జరగడం లేదని కొందరు గర్భిణీ స్త్రీలు తెలుపుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ప్రభుత్వం మాతా శిశు సంరక్షణ లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే గర్భిణీ స్త్రీలు ప్రసవాలు చేయించుకోవాలని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. గర్భిణీ స్త్రీల వైద్యం గురించి 24 గంటలు వైద్య సేవలు అందించాలని ప్రత్యేక నిబంధనలు ఉన్నా కానీ అమలు కావడం లేదు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి గర్భిణీ స్త్రీలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, సాధారణ వ్యాధిగ్రస్తులకు వైద్యుల సమక్షంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటారని మండల ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments