-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. అమలు చేయగలిగే హామీలు, గ్యారంటీలు మాత్రమే ఇవ్వాలని, ప్రణాళిక లేని హామీలు బడ్జెట్ పై భారం వేయడమే కాకుండా, పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని చెప్పడంపై ప్రధాని మోడీ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని, ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కంటే కాంగ్రెస్ ఎంతో బెటర్ అని, మెల్లమెల్లగా గ్యారంటీలు, హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. అయితే రాష్ట్రంలో 2023 డిసెంబర్ ఏడో తేదీన కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. మరో నెల రోజుల్లో ఈ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనుంది. వారం రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు సైతం కసర్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఏడాదిలో అమలైన వాటిని పరిశీలిస్తే.. చెప్పిన వాటిలో పూర్తి చేసినవి చాలా కొన్ని మాత్రమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఆరు గ్యారంటీల్లో అమలైనవెన్ని?
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘ఆరు గ్యారంటీలు’ కీలక పాత్ర పోషించాయి. అయితే ఈ ఆరు గ్యారంటీల్లో గృహజ్యోతి ఒక్కటే పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయగలిగింది. ఈ స్కీమ్ కింద అర్హులకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. మహాలక్ష్మి గ్యారంటీ కింద మహిళలకు మూడు హామీలు ఇవ్వగా.. ఒక్క ఫ్రీ బస్ జర్నీని మాత్రమే పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నది. రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నా.. అది అర్హులైన ప్రతి కుటుంబానికి అందడం లేదనే విమర్శలున్నాయి. మహిళలకు ఇస్తాన్న రూ. 2500 ఆర్థిక సాయం హామీ అసలు ప్రస్తావనలోనే లేకుండాపోయింది. రైతుభరోసా గ్యారంటీ కింద ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటనలకే పరిమితమైంది. రైతుబంధు పేరు మార్చి రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని చెప్పి… ఉన్న రైతు బంధును ఎగ్గొట్టేశారని రైతులు వాపోతున్నారు. తమకు ఇస్తామన్న రూ. 12వేల కోసం రైతుకూలీలు ఎదురుచూస్తూనే ఉన్నారు. యువ వికాసం గ్యారంటీ కింద విద్యా భరోసా కింద విద్యార్థులకు రూ. 5 లక్షలు, ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ హామీని పూర్తిస్థాయిలో మరిచిపోయినట్టు కనిపిస్తున్నారు. ప్రభుత్వం ఏడాది పూర్తి కావస్తున్నా ఇందిరమ్మ ఇండ్ల గ్యారంటీ ఇంకా సమావేశాల్లో చర్చల దశలోనే ఉన్నది. చేయూత గ్యారంటీ కింద రెండు హామీలు ఇవ్వగా, ఇందులో ఆరోగ్య శ్రీ కింద ఇన్సూరెన్స్ ను రూ. 10 లక్షలకు పెంచారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర వర్గాలకు ఇస్తున్న పింఛన్లను రూ. 4వేలకు పెంచుతామన్న హామీని పూర్తిస్థాయిలో మరిచిపోయినట్టు కనిపిస్తున్నారు.
డిక్లరేషన్ల హామీలూ అలాగే..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలే కాకుండా వివిధ డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ వందలాది హామీ ఇచ్చింది. వీటిలో అమలు చేసినవి వేళ్లలో లెక్కపెట్టొచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని కాంగ్రెస్ చెప్పింది. అయితే ఈ అంశం సమావేశాలకే పరిమితమైంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. ఏకకాలంలో రైతు రుణమాఫీని అమలు చేశామని చెబుతున్నా అనేక విమర్శలు వచ్చాయి. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. ఇంకా రుణమాఫీ కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగ యువతకు రూ. 4వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ‘యూత్ డిక్లరేషన్’లో హామీ ఇచ్చినా… అలాంటిదేమీ చెప్పలేదని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాట మార్చేశారు. అమరవీరుల కుటుంబాలకు రూ. 25వేల గౌరవ పెన్షన్, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం హామీలు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తే లేకుండాపోయాయి. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యువ మహిళా సాధికారత పేరుతో చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని ‘ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్’లో పేర్కొన్నది. కల్యాణలక్ష్మి కింద రూ. లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ, విద్యార్థులకు ఫ్రీ వైఫై సౌకర్యం, రూ. 3లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు, అంగన్ వాడీ టీచర్ల వేతనం రూ. 18వేలకు పెంపు, రవాణా వాహనాలకు సింగిల్ పర్మిట్ విధానం.. ఇలాంటి హామీల అమలుపై కనీసం ఎలాంటి చర్చా జరగడం లేదు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments