ఆత్మహత్యకు ముందు కుటుంబసభ్యులకు మేసేజీలు
తాను లైంగిక వేధింపులకు గురయ్యాయనని ఆవేదన
నిందితులు తన ఫొటోలు బయటపెడతామంటూ బెదిరించారని వెల్లడి
తాను వెళ్లిపోకతప్పదంటూ చివరి మెసజ్
విశాఖలో 17 ఏళ్ల విద్యార్థిని కాలేజీ భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తాను లైంగిక వేధింపులకు గురయ్యానంటూ కుటుంబసభ్యులకు మెసేజ్ చేసి బాలిక బలవన్మరణానికి పాల్పడింది. నిందితుల వద్ద తన ఫొటోలు ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ వారు బెదిరించారని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.
బాధితురాలు వైజాగ్‌లోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. ఆమె కుటుంబం అనకాపల్లి జిల్లాలో ఉంటోంది. కాగా, బాలిక అదృశ్యమైనట్టు గురువారం రాత్రి 10 గంటలకు వారికి విద్యాసంస్థ నుంచి సమాచారం వచ్చింది. బాలికకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ రాత్రి సుమారు 12.50 సమయంలో బాలిక తన తల్లిదండ్రుల వరుస మెసేజీలకు స్పందించింది.
‘‘మీరు కంగారు పడొద్దు. నేను చెప్పేది వినండి. నేను ఎందుకు వెళ్లిపోతున్నానో మీకు చెప్పలేను. నేను చెప్పినా మీకు అర్థంకాదు. నన్ను మర్చిపోండి. క్షమించండి. అమ్మా.. నాన్నా.. నన్ను పెంచి పెద్దచేసినందుకు ధన్యవాదాలు. నా అధ్యాయం ముగిసిపోయింది’’ అని ఆమె చెప్పింది.
త్వరలో తల్లి కాబోతున్న తన అక్కకు బాలిక శుభాంకాంక్షలు తెలిపింది. ‘‘నీ భవిష్యత్తుపైనే దృష్టి పెట్టు. నీకు కావాల్సిన చదువు చదువుకో. డిస్ట్రాక్ట్ కాకు. నాలా ఇతరుల ప్రభావానికి లోనుకావద్దు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు’’ అని రాసింది.
కాలేజీలో లైంగిక వేధింపులకు గురికావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాలిక తండ్రికి చెప్పింది. ‘‘వాళ్ల వద్ద నా ఫొటోలు ఉన్నాయి. వాటితో నన్ను బెదిరిస్తున్నారు. మిగతా అమ్మాయిలు కూడా ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేకుండా ఉన్నాం. కాలేజీకి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇరకాటంలో పడిపోయాం. నేను పోలీసులకు, కాలేజీ వాళ్లకు ఫిర్యాదు చేసినా వాళ్లు నా ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తారు’’ అని ఆమె పేర్కొంది.
‘‘నేను ఇప్పుడు వెళ్లిపోతే మీరు కొన్నాళ్లు బాధపడినా ఆ తరువాత మర్చిపోతారు. కానీ, నేనుంటే మాత్రం మీరూ రోజూ నన్ను చూసి బాధపడతారు. మిమ్మల్నందరినీ బాధ పెట్టినందుకు సారీ’’ అని ఆమె చెప్పుకొచ్చింది.
కాగా, కూతురి మరణంతో దుఃఖసాగరంలో కూరుకుపోయిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నా కూతురు ఎందుకు చనిపోయిందో నాకు తెలియాలి. ఎంతో ప్రేమతో ఆమెను పెంచి పెద్దచేశా. పదోతరగతిలో ఆమెకు మంచి మార్కులు వచ్చాయి. ఈ కాలేజీలో గొప్పగా బోధిస్తారని చేర్పించా’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనపై స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్ తమ కాలేజీలో పురుషులెవరికీ అనుమతి లేదని అన్నారు. ‘‘విద్యార్థులపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతాం. గర్ల్స్ హాస్టల్‌లోకి పురుషులను అనుమతించం. అక్కడ అందరూ మహిళా వార్డెన్లు ఉన్నారు. హెరాస్‌మెంట్‌కు అవకాశమే లేదు’’ అని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అధ్యాపకులను, ఇతర స్టూడెంట్లను ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments