హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పంటి చికిత్స కోసం డెంటల్ ఆసుపత్రికి వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు మరణించడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
Thank you for reading this post, don't forget to subscribe!హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడి ప్రాణం పోయిందని మృతుడి తండ్రి ఆరోపించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వివరాలిలా ఉన్నాయి.. మిర్యాలగూడలోని సరస్వతినగర్‌కు చెందిన వింజం లక్ష్మీనారాయణ (28) తన కుటుంబంతో కూకట్‌పల్లి సమీపంలోని హైదర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న లక్ష్మీనారాయణకు నిశ్చితార్థం జరిగింది. మార్చి 13న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. లక్ష్మీనారాయణకు పంటినొప్పి ఉండటంతోపాటు కింది వరుస పళ్లను సరిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఆన్‌లైన్‌లో చూడగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 37లోని ఎఫ్‌ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి గురించి తెలిసింది.
నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు ఈ నెల 16న మధ్యాహ్నం 1.30 గంటలకు ఎఫ్‌ఎంఎస్ డెంటల్ క్లినిక్‌కు వెళ్లాడు. రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్న తర్వాత కింది వరుసలో దంతాలు వంకరటింకరగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని లక్ష్మీనారాయణ కోరాడు. దీనికోసం తమ వద్ద లేజర్ ట్రీట్‌మెంట్ ఉంటుందని చెప్పగా.. చికిత్సకు అంగీకరించాడు. చికిత్స అనంతరం తీవ్రమైన నొప్పితోపాటు వాంతులు కావడంతోపాటు ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు.
ఆందోళనకు గురైన ఎఫ్‌ఎంఎస్ దవాఖాన సిబ్బంది లక్ష్మీనారాయణను హుటాహుటిన అంబులెన్స్‌లో అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. డెంటల్ చికిత్స కోసం వెళ్లిన లక్ష్మీనారాయణ రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా అపోలో దవాఖానలో ఉన్నట్టు తేలింది. అక్కడకు వెళ్లిచూడగా అతడి మృతదేహం కనిపించింది.
గుండెపోటుతో లక్ష్మీనారాయణ మృతి చెంది ఉంటాడని, డెంటల్ దవాఖాన వర్గాలు తెలిపాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో ఎఫ్‌ఎంఎస్ డెంటల్ క్లినిక్ వైద్యుల నిర్లక్ష్యంతోనే కొడుకు మృతి చెందాడంటూ మృతుడి తండ్రి రాములు ఆరోపించారు. అనస్తీషీయా డోస్ ఎక్కువగా ఇచ్చారని.. దాని ప్రభావంతోనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట ఆందోళన చెపట్టారు.
అనంతరం ఈ నెల 17న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 304 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాలంటే హిస్టో పాథాలజీ నివేదిక రావాల్సిందేనని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments