ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య వార్ ముదురుతోంది. ముఖ్యంగా విపక్షాల దూకుడును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీఎం జగన్ మరోసారి కొరడా ఝళిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు జరుపుతున్న సమయంలోనే రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
చంద్రబాబుకు తాజాగా ముందస్తు బెయిల్ లభించిన కేసుల్లో ఒకటైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విజయవాడ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీతో చర్చల్లో మునిగి తేలుతున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ నమోదు చేసిన ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్ సహా పలువురి పేర్లను ఇందులో ప్రస్తావించింది.
అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు, మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ సీఆర్డీఏకి ఎక్స్ అఫీషియో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ హోదాల్లో సింగపూర్ ప్రభుత్వానికీ, ఏపీ ప్రభుత్వానికీ మధ్య అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఒప్పందం జరిగిందని కేబినెట్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని సీఐడీ ఆరోపిస్తోంది. కానీ అలాంటి ఒప్పందమేమీ జరగలేదని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా లేదని సీఐడీ తేల్చింది. కేవలం నామినేషన్ ప్రాతిపదికన సింగపూర్ సంస్ధ సుర్బానా జురాంగ్ కు పనులు అప్పగించినట్లు తెలిపింది.
ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ తో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్ అక్రమంగా లబ్ది పొందారని సీఐడీ ఛార్జిషీట్ లో ఆరోపించింది. హెరిటేజ్ ఫుడ్స్ ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన 14 ఎకరాలు, మంత్రి నారాయణ బంధువులు 58 ఎకరాలు, లింగమనేని రమేష్ అప్పటికే ఉన్న తమ భూముల రేట్లు పెంచుకున్నారని సీఐడీ తెలిపింది. అయితే ఈ ఛార్జిషీట్ దాఖలుకు గవర్నర్ నుంచి సీఐడీ అనుమతి తీసుకోకపోవడంతో ఏసీబీ కోర్టు తిరస్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments