గోబర్ గ్యాస్ తెలుసుకదా.. అదేనండి వంట వండటానికి ఉపయోగిస్తుంటాం. దాంతో వంట చేసుకోవటం పాత విషయమే కానీ తాజాగా గోబర్‌గ్యాస్‌తో రాకెట్లనూ నడపొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.
జపాన్‌కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ ఏకంగా గోబర్‌గ్యాస్‌తో పనిచేసే రాకెట్ ఇంజిన్‌ను రూపొందించింది. రాకెట్ ఇంజిన్లలో రకరకాల ఇంధనాలు వాడుతుంటారు. చాలావరకు బాగా శుద్ధి చేసిన కిరోసిన్‌ను ఉపయోగిస్తారు. దీనికి భిన్నంగా జపాన్‌కు చెందిన ఇంటర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ అనే అంకుర సంస్థ పర్యావరణహిత రాకెట్ ఇంజిన్‌ను రూపొందించింది. దీని పేరు ‘జీరో’. ఇది ఆవు పేడ నుంచి తీసిన బయోమీథేన్ వాయువు సాయంతో పనిచేస్తుంది. ఈమధ్యనే దీన్ని విజయవంతంగా పరీక్షించారు.

చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడమే ‘జీరో’ ఇంజిన్ ఉద్దేశం. వాతావరణంలోకి అదనంగా కార్బన్ డయాక్సైడ్‌ను వెదజల్లకుండా దీన్ని తయారుచేశారు. నిజానికి బయోమీథేన్ పూర్తిగా ఉద్గార రహితమేమీ కాదు. ఇది మండినప్పుడూ బొగ్గుపులుసు వాయువు విడుదలవుతుంది. కానీ సాధారణ శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇందులో వెలువడే కార్బన్ డయాక్సైడ్ మోతాదును చాలా పరిమితం. సహజంగా ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్‌కు ఇది అదనపు వాయువునేమీ జోడించదు.
పెరుగుతున్న సాంకేతిక, వివిధ రిమోట్ సెన్సింగ్ వస్తువుల వాడకం, ఇతర కారణాల వల్ల రాకెట్ ప్రయోగాలు ఊపందుకుంటున్నాయి. పర్యావరణం మీద వీలైనంత తక్కువ దుష్ప్రభావం పడేలా చూడటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. మున్ముందు అంతరిక్ష పర్యటనలు కొనసాగాలంటే ఇది మరింత అవసరం. ఈ నేపథ్యంలో వినూత్న జీరో రాకెట్ ఆసక్తి కలిగిస్తోంది. నిశ్చల ప్రయోగ పరీక్షలో మంచి సామర్థ్యాన్ని కనబరచింది. ఇది 10 సెకండ్ల పాటు నీలి మంటను వెలువరించింది.
Recent Comments