– మంత్రిమండలి కీలక నిర్ణయాలు
– బీసీ రిజర్వేషన్లపై సమగ్ర చర్చ
ఎన్నికలు వాయిదా పడితే నిధుల నిలుపుదల ప్రమాదం
– ప్రజాపాలన విజయోత్సవాలకు భారీ ప్రణాళిక
హైదరాబాద్, 17 నవంబర్ :
రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జరిగిన మంత్రిమండలి సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం, దానికి సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు, గత తీర్మానాలు, గవర్నర్ వద్ద పెండింగ్, హైకోర్టు స్టే వంటి విషయాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ చర్చల మధ్య, ఎన్నికలు వాయిదా పడితే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన దాదాపు 3 వేల కోట్ల నిధులు నిలిచిపోవడంతో, ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం చేసిన చిత్తశుద్ధి ప్రయత్నాలను గుర్తు చేసిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆర్డినెన్స్‌ను తోసిపుచ్చినప్పటికీ, న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం, న్యాయస్థానాల్లో కేసు తేలిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలనే అభిప్రాయాన్ని కేబినెట్ వ్యక్తం చేసింది. అలాగే పార్టీపరంగా బీసీలకు 42 శాతం టికెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
రెండేళ్లు పూర్తిచేసుకున్న ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫోర్త్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఇక డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ సేవలను స్మరిస్తూ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను పాఠ్యపుస్తకాల మొదటి పేజీలో ప్రచురించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా అందెశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వడంతో పాటు, ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని స్మృతివనంగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ సమావేశంలో గిగ్ వర్కర్ల ప్రయోజనాల కోసం రూపొందించిన బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనిని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టరూపం కల్పించనున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రజల అభ్యర్థన మేరకు ఎస్ఆర్ఎస్పీ మెయిన్ కెనాల్‌కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments