Wednesday, October 15, 2025

శ్మశానంలో ఎముకల దొంగలు!

శ్మశానంలో దొంగలు పడ్డారు.. శవాన్ని దహనం చేయగా మిగిలిన పుర్రెలు, ఎముకల్ని చోరీ చేస్తున్నారు.. వీటిని ఏం చేస్తారో తెలియదు కానీ..

Thank you for reading this post, don't forget to subscribe!

కొందరు యువకుల ముఠా ఈ దురాగతానికి పాల్పడుతోంది.. మంత్రతంత్రాలు, పూజలు, చేతబడులు చేయడం లాంటి మూఢనమ్మకాల్ని ఇప్పటిదాకా చూశాం.. విన్నాం.. కానీ, ఇలాంటి విచిత్రమైన ఘటన జిల్లాలో చోటుచేసుకోవడం విస్మయం కలిగిస్తోంది.

రెండు రోజుల్లో నలుగురి పట్టివేత..

సుల్తానాబాద్‌లోని హిందూ శ్మశానవాటికలో రెండురోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులు ఎముకలు చోరీచేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. శవాలను కాల్చివేయగా మిగిలిన ఎముకలను పోగుచేసుకుని, ఒక సంచీలో వేసుకుని తీసుకెళ్తున్నారు. శుక్రవారం ఇద్దరు యువకులు ఇలా ఎముకలు తీసుకెళ్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎముకల్ని అక్కడే వదిలివేయగా, ఆ యువకులను బెదిరించి అక్కడి నుంచి పంపించివేశారు. శనివారం ఇద్దరు మహిళలు కూడా శ్మశానంలో ఎముకలు పోగుచేస్తూ అక్కడి మున్సిపల్‌ సిబ్బందికి పట్టుపడ్డారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా..

కొన్నిరోజులుగా వైకుంఠధామాల్లోని ఎముకలు మాయమువుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహాల ఎముకలను కుటుంబ సభ్యులు సేకరించి 5, 9, 11వ రోజుల తర్వాత గోదావరి నదిలో కలుపడం సంప్రదాయం. అయితే, కొన్నిరోజులుగా శ్మశానంలో అస్థికలు కనిపించకపోవడంతో చాలామంది అవి కాలిపోయినట్లు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఎముకల దొంగలు పట్టుపడడంతో తమవారి ఎముకలను కూడా వారే ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ముఠాను మున్సిపల్‌ సిబ్బంది రాజకుమార్‌, వినోద్‌ పట్టుకున్నారు. మాజీ సర్పంచ్‌ అంతటి అన్నయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు మున్సిపల్‌ సిబ్బందికి సహకరించారు.

విచారణ జరుపుతున్న పోలీసులు..

రెండురోజుల వ్యవధిలో నలుగురు ఎముకల దొంగలు పట్టుపడడంతో సుల్తానాబాద్‌ మున్సిపల్‌ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా, పదేళ్లక్రితం మృతదేహాలను కాల్చిన కట్టెల బొగ్గులు తీసుకుని వచ్చి కంకులు కాల్చేవారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలా చేసేవారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!