బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళాలు రూ.171 కోట్లు.. బీజేపీతో పోల్చితే ఏడు రెట్లు తక్కువ
2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి రూ.34 కోట్ల విరాళాలు
ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో కీలక వివరాలు పేర్కొన్న పార్టీలు
ఆర్థిక సంవత్సరం 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కేంద్రంలోని అధికార బీజేపీకి సుమారు రూ.1300 కోట్ల విరాళాలు అందాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి మొత్తం రూ.2120 కోట్ల విరాళాలు అందగా.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినవే 61 శాతంగా ఉన్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో బీజేపీ పేర్కొంది. ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ కంటే ఏకంగా 7 రెట్లు ఎక్కువగా బీజేపీకి విరాళాలు అందడం గమనార్హం. ఇక ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ.1775 కోట్ల విరాళాలు సేకరించినట్టు బీజేపీ పేర్కొంది. వడ్డీ రూపంలో 2021-22లో రూ.135 కోట్లు, 2022-23లో రూ.237 కోట్ల ఆదాయాన్ని పొందామని వివరించింది.
2022-23లో ఎన్నికలు, సాధారణ ప్రచారం కోసం చేసిన మొత్తం వ్యయంలో విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి రూ.78.2 కోట్లు చెల్లించినట్టు వార్షిక ఆడిట్ రిపోర్టులో బీజేపీ పేర్కొంది. అంతక్రితం ఏడాది 2021-22లో ఈ మొత్తం రూ.117.4 కోట్లుగా ఉందని తెలిపింది. పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా రూ.76.5 కోట్లు అందించినట్టు పేర్కొంది. 2021-22లో ఈ మొత్తం రూ.146.4 కోట్లుగా ఉందని వివరించింది.
మరోవైపు విపక్ష కాంగ్రెస్‌కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.171 కోట్ల ఫండ్స్ అందాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విరాళాలు రూ.236 కోట్లుగా ఉండగా ఈసారి తగ్గుదల నమోదయ్యింది. ’సమాజ్ వాదీ పార్టీ’కి 2021-22లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.3.2 కోట్లు వచ్చాయి. కానీ 2022-23లో ఎలాంటి విరాళాలు అందకపోవడం గమనార్హం. టీడీపీకి 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.34 కోట్లు అందాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆ పార్టీ విరాళాలు 10 రెట్లు పెరిగాయి.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments