Friday, November 22, 2024

మూడు వైన్ షాపులు… 300 బెల్ట్ షాపులు

◾️వైన్ షాపు సహకారం… బెల్ట్ షాపు ఇష్టరాజ్యం
◾️ నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లకు మద్యం విక్రయాలు
◾️ మత్తులో తోలుతున్న యువత
◾️ రెచ్చిపోతున్న మద్యం మాఫియా….. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ



తాగేందుకు బుక్కడు నీరు లేని పల్లెలు ఉన్నాయి…. కానీ మందు దొరకని పల్లెలు మాత్రం ఒక్కటి లేదు. పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రామాలు, తండాల్లో పుట్టగొడుగుల బెల్ట్ దుకాణాలు వేలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటుచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేకమంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిపాలవుతున్నాయి.



రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రంతో సహా గ్రామాలలో బహిరంగంగానే బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అనుమతి పొందిన వైన్ షాపుల నుంచే వందల సంఖ్యలో మద్యం బాటిల్లు బెల్టు దుకాణాలకు తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. సంబంధిత ఎక్సైజ్ శాఖ అనుసంధానాల్లోనూ, బెల్టు దుకాణాల నిర్వహణకు ప్రోత్సాహం ఉందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. గ్రామాలు తండాల్లో బెల్ట్ షాపులు కొనసాగుతూ ప్రజలు మత్తులో చిత్తవుతున్నా... నిరోధించాల్సిన సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఓవైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవన ఉపాధి కల్పిస్తుంటే మరోవైపు బెల్ట్ షాపులు పల్లె ప్రజలను మత్తులో ముంచెత్తుతున్నాయి. కానీ ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదు.
మందు మొత్తం బెల్ట్ షాపులకు
మండలంలోని వైన్ షాప్ నిర్వాహకులు బెల్ట్ షాపులకు మందు విక్రయించేందుకే అధిక ప్రయారిటీ ఇస్తున్నారు. కస్టమర్స్ కు నేరుగా అమ్మితే ఎమ్మార్పీ వస్తుంది. అదే బెల్ట్ షాప్ కు అమ్మితే ఎంఆర్పికి మించి అమ్మొచ్చనే ఉద్దేశంతో వైన్ షాప్ నిర్వాహకులు ఈ పనికి పాల్పడుతున్నారు. వైన్ షాపులలో మామూలు లిక్కర్ ఉంచి... బెల్ట్ షాపులకు మంచి మందులు సప్లై చేస్తున్నారు. పేరున్న బ్రాండ్లను క్వార్టర్ బాటిల్ పై రూ.20 వరకు ఎక్కువ రేట్లకు బెల్ట్ షాపులకు పంపిస్తున్నారు. మొదట ఎమ్మార్పీ పై రూ.5 అదనంగా అమ్మిన వైన్ షాప్ ల నిర్వాహకులు, ఇప్పుడేమో ఏకంగా క్వార్టర్ బాటిల్ పై రూ.20 అదనంగా బెల్ట్ షాపు నిర్వాహకుల వద్ద తీసుకుంటున్నారు. వాళ్లు మరో రూ.20 చూసుకొని కస్టమర్లకు ఇస్తున్నారు. వైన్ షాపుకు వచ్చిన కస్టమర్లకు మాత్రం అడిగిన బ్రాండ్ లేదని, ఇతర బ్రాండ్లకు చెందిన సీసాలను అంతగాడుతున్నారు. దీంతో కొన్నిసార్లు షాపులోని సిబ్బందితో కస్టమర్లు గొడవకు దిగుతున్నా పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వైన్ షాపుల యజమానుల నిర్వాహకంతో మండలంలో రోజుకో కొత్త బెల్ట్ షాపు పుట్టుకొస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు.
పచ్చని సంసారాల్లో చిచ్చు
మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరు రా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీంతో పొద్దంతా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి విచ్చేస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహిస్తుండడంతో యువత పెడదారి పడుతున్నారు.

పేరుకే కిరాణం… కానీ అమ్మేది మధ్యమే!
అనేకమంది పేరుకే కిరణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ఫ్రిజ్లులు పెట్టుకొని మరి విక్రయిస్తున్నారు. వైన్ షాప్ ల యజమానులు ఆటోల ద్వారా మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు నిత్యం ఆటోల ద్వారా పేరు మోసిన బ్రాండ్లను పంపించి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుందనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి