తిరుపతిలో విచిత్రమైన కేసు..
ఎంఆర్ పల్లి పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు
48 గంటల్లో చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరిక
అవాక్కయినా పోలీసులు
తిరుపతిలో విచిత్రమైన మిస్సింగ్ కేసు నమోదైంది. తమ చెరువు కనిపించడం లేదని, తప్పిపోయిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. చెరువును వెతికిపెట్టాలంటూ ఎమ్మార్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటల్లో దీనిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
తిరుపతిలో ఇదొక వెరైటీ మిస్సింగ్ కేసు.. పోలీసులే ఈ ఫిర్యాదు చూసి షాక్ అయ్యారు. సాధారణంగా పిల్లలు తప్పిపోయారనో లేదా ఇంట్లో వాళ్లు కనిపించలేదంటూనో పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు రావటం చూస్తుంటాం. తప్పిపోయిన తమవారిని వెతికిపెట్టాలంటూ వారి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతుంటారు. కానీ.. తిరుపతి జిల్లా ఎమ్మార్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన ఘటన జరిగింది. చిన్నప్పటి నుంచి తాను చూస్తూ పెరిగిన చెరువు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. మా చెరువు కనిపించడం లేదు.. ప్లీజ్ వెతికిపెట్టండి సార్.. అంటూ పోలీసులను ఆశ్రయించాడు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో సుమారు వంద ఎకరాల చెరువు కనిపించకుండా పోయిందనీ.. వెతికి పెట్టాలంటూ ఏపీ ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం ఉదయం ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు చెరువు ఎక్కడున్నావ్.. చెరువు మిస్సింగ్ అంటూ ప్లకార్డులు చేతపట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో చెరువు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మార్ పల్లి పోలీసులు షాక్ అయ్యారు. ఇలాంటి భూమికి సంబంధించి విషయాలు రెవెన్యూ అధికారుల వద్ద తేల్చుకోవాలంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు సుందరీకరణ పేరుతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్ల రూపాయలు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) నిధులు ఆ చెరువులో పోశారని సుధాయాదవ్ ఆరోపించారు. గతంలో పేరూరు చెరువు, స్వర్ణముఖి నుంచి కాలువలు ద్వారా తుమ్మలగుంట చెరువుకు నీళ్లు వచ్చేవని అన్నారు. తుమ్మల గుంట చెరువు కారణంగా ఆ చుట్టుపక్కల సుమారు180 ఎకరాల ఆయకట్టుతో పొలాలు పచ్చగా, గ్రామాలు పుష్కలంగా ఉండేవన్నారు. అయితే ప్రస్తుతం చెరువులోకి నీళ్లు వచ్చే మార్గం లేకుండా పోయిందని సుధాయాదవ్ విమర్శించారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోయి చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు. వరదలు వస్తే ఆ నీరంతా తిరుపతిని ముంచెత్తుతోందన్న సుధాయాదవ్.. తుమ్మలగుంట చెరువు విషయంలో ఇటీవలే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలని సూచించిందని చెప్పారు.ఈ నేపథ్యంలోనే కనిపించకుండా పోయిన తుమ్మల గుంట చెరువును వెతికిపెట్టమని పోలీసులను, ఆర్డీవోను కోరినట్లు సుధాయాదవ్ చెప్పారు. తమ ఫిర్యాదుపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments