హెల్త్ న్యూస్ : ఒకప్పుడు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) అంటే 50, 60 ఏళ్లు దాటిన వృద్ధాప్యపు హద్దుల్లో సంక్రమించే వ్యాధులుగా భావించేవారు. కానీ కాలం మారింది. ఈ ‘ముసలి రోగాలు’ ఇప్పుడు ఏకంగా యవ్వనంపైనే దాడి చేస్తున్నాయి. 30 ఏళ్ల లోపు యువతలోనూ బీపీ, షుగర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఆధునిక జీవనశైలి పేరుతో అలవాటు చేసుకుంటున్న శారీరక శ్రమ లేమి, ఫాస్ట్‌ఫుడ్ వ్యసనం, విపరీతమైన మానసిక ఒత్తిడి – ఇవే ఈ అసాంక్రమిక వ్యాధుల (NCDs)కు ప్రధాన హేతువులుగా వైద్య నిపుణులు ఘోషిస్తున్నారు.
ఎన్‌సీడీ సర్వేలో భయంకర వాస్తవం: నిశ్శబ్ద హంతకుల విస్తరణ!
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ఎన్‌సీడీ సర్వే (NCD Survey) లో బయటపడిన గణాంకాలు నిజంగానే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 22 కేంద్రాలు ఉండగా పట్టణం లో 5 ఆరోగ్య కేంద్రాలను డాటా ఆధారంగా బీపీ బాధితులు 36,823 ఉండగా, షుగర్ బాధితులు 16,424 మందిగా నమోదయ్యారు. ఈ లెక్కలు చూస్తే, “ఇంకా ఎన్ని కుటుంబాల్లో ఈ నిశ్శబ్ద హంతకులు పాకిపోతున్నారో?” అనే భయం సర్వత్రా నెలకొంది. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, బేల, జైనథ్, నేరడిగొండ వంటి మారుమూల పీహెచ్‌సీల పరిధిలో కూడా ఈ కేసులు అధికంగా నమోదవడం, పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఒక పేషెంట్ వేదన: “ఇక మందుల బాట తప్పదు”
“మూడు సంవత్సరాల క్రితం వరకు నాకెలాంటి ఆరోగ్య సమస్య లేదు. ఒక్కసారిగా తలనొప్పి, విపరీతమైన అలసట మొదలయ్యాయి. పరీక్ష చేయించుకోగా బీపీ, షుగర్ రెండూ వచ్చేశాయని డాక్టర్ చెప్పారు. అప్పటి నుంచి నా జీవితం ‘మందుల బాట’ పట్టింది. ఇప్పుడు ప్రతిరోజూ టాబ్లెట్స్ వేసుకోక తప్పట్లేదు. ఒక్క రోజు విస్మరించినా గుండె బరువుగా అనిపిస్తోంది” అని తన వేదనను పంచుకున్నాడు జైనథ్ మండలానికి చెందిన యువ రైతు క్యాతం వెంకటరెడ్డి. ఈ ఒక్క ఉదంతమే.. వేల మంది యువ భారతీయుల నిత్య జీవితాన్ని ఈ వ్యాధులు ఎలా మార్చేశాయో స్పష్టం చేస్తోంది.
జీవనశైలి మార్పే అసలైన ఔషధం
ఈ వ్యాధులను అదుపులో ఉంచడానికి మరియు నివారించడానికి వైద్యులు సూచిస్తున్న ప్రధాన మార్గం… జీవనశైలిలో మార్పు. రోజూ కనీసం 30 నిమిషాలు వేగంగా నడక లేదా క్రమం తప్పని వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్, అధిక ఉప్పు, నూనె, చక్కెర వాడకాన్ని అత్యవసరంగా తగ్గించుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా, ప్రస్తుత సమాజంలో పెరిగిన ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం (మెడిటేషన్), యోగా సాధన చేయడం అత్యుత్తమం.

రిమ్స్ డైరెక్టర్ హెచ్చరిక: నిర్లక్ష్యం కాకూడదు!
రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ… “30–40 ఏళ్ల మధ్య వయసులోనే బీపీ, షుగర్ కేసులు ఉద్ధృతమవుతున్నాయి. ఒకసారి రోగం దరి చేరితే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, అది గుండెపోటు, పక్షవాతం (స్ట్రోక్), కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన, కోలుకోలేని పరిణామాలకు దారి తీస్తుంది. క్రమం తప్పకుండా మందులు వాడటం, కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. ప్రజలు తమ ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోవద్దు.” అని గట్టిగా హెచ్చరించారు.
ప్రభుత్వ చర్యలు: NCD క్లినిక్‌ల ద్వారా ఉచిత వైద్యం
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో NCD (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్‌ల ద్వారా రోగులకు ఉచిత పరీక్షలు, అవసరమైన మందులు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి గుర్తించిన తీవ్రమైన కేసులను ఇక్కడికి రిఫర్ చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తలు (హెల్త్ వర్కర్లు) కూడా ప్రజలకు ఆహారపు అలవాట్లలో మార్పుల ఆవశ్యకతను వివరిస్తూ, మందులు ఆపొద్దని నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు.
Recent Comments