తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత అక్రమాస్తుల్లో భాగమైన బంగారు, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని సివిల్ అండ్ సెషన్స్ కోర్టు తేదీలను నిర్ణయించింది.
Thank you for reading this post, don't forget to subscribe!మార్చి 6, 7 తేదీల్లో వచ్చి గోల్డ్, వజ్రాభరణాలను తీసుకెళ్లాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిని తీసుకెళ్లడానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని సూచించింది. ఆ రెండు రోజుల్లో ఇతర కేసులను విచారించకూడదని కోర్టు నిర్ణయించింది.
బంగారు ఆభరణాలను తీసుకెళ్లడానికి తాము ఒక అధికారిని నియమించామని… తమిళనాడు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని న్యాయమూర్తి తెలిపారు. ఆరు పెద్ద ట్రంకు పెట్టెలతో పాటు అవసరమైన సిబ్బంది, ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ తో రావాలని చెప్పారు. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న నగలన్నీ కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వీటిలో 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 4 సీడీ ప్లేయర్లు, 1 వీడియో కెమెరా, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, రూ. 1,93,202 నగదు ఉన్నాయి.
జయలలితకు అక్రమాస్తుల కేసులో 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ లేదా ఎస్బీఐ ద్వారా కానీ, లేదా బహిరంగ వేలం ద్వారా కానీ అమ్మాలని తెలిపింది. అయితే, ఇంతలోనే జయలలిత చనిపోయారు. ఈ నేపథ్యంలో, మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments