సాధారణంగా ఇంట్లో, పరిసరాల్లో దోమలు తిరుగుతుంటే చాలా భయం కలుగుతుంది. ఇవి కుడితే నొప్పితో పాటు వివిధ రకాల వ్యాధులు కూడా వస్తాయి. అయితే మహారాష్ట్రలోని పూణె (Pune) వాసులకు ఈ రిస్క్ భారీగా పెరిగిపోయింది.
Thank you for reading this post, don't forget to subscribe!ఈ నగరం ప్రస్తుతం తీవ్రమైన దోమల సమస్యను ఎదుర్కొంటోంది. ఆ సమస్యకు అద్దం పట్టేలా తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను నగరంలోని ఖరాడి ప్రాంతంలో షూట్ చేశారు. అందులో ఆకాశంలో భారీ సంఖ్యలో దోమలు ‘సుడిగాలి’ లేదా టోర్నడో (Mosquito Tornado) రూపంలో ఎగిసిపడ్డాయి. అవన్నీ కలిసి చాలా పొడవుగా ఒక టోర్నడో రూపంలో ఏర్పడి కుప్పలు తెప్పలుగా నగరంలోకి ప్రవేశిస్తున్నాయి.
షాక్ అయిన స్థానికులు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో రిటైర్డ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ వీరేంద్ర సింగ్ విర్ది, ఎక్స్ (X) ప్లాట్‌ఫామ్ వేదికగా ఈ వీడియోను షేర్ చేశారు. దోమల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియో చాలా మంది నెటిజన్లను షాక్‌కి గురి చేసింది. పరిస్థితిపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న సమస్య
నగరంలో ప్రవహించే మూలా ముఠా నది (Mula Mutha River) నీటిమట్టం పెరగడం వల్లే దోమలు ఈ రేంజ్‌లో పుట్టుకొచ్చాయని కొందరు తెలిపారు. నదీగర్భంలో నీరు నిలిచిపోవడంతో దోమలు మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమస్యను నివారించడంలో పూణె మున్సిపల్ కార్పొరేషన్ (PMC) వైఫల్యమైందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
శాశ్వత పరిష్కారం చూపాలి: నెటిజన్లు
రెండు రోజుల క్రితం నది నుంచి ఎక్కువ నీటిని తొలగించడానికి PMC ప్రారంభించిందని, అయితే పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని ఒక నెటిజన్ తెలిపారు. PMC ఏదైనా చేసినా, కొన్ని నెలల్లోనే దోమలు తిరిగి వస్తాయని మరొక యూజర్ చెప్పారు. ముఖ్యంగా వర్షాకాలంలో పుణెలో దోమల సమస్య వేధిస్తోందని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని PMCని కోరారు.
విఫలమైన PMC
దోమల బెడద వల్ల ఆరోగ్యానికి చాలా ముప్పు ఉంటుంది. అవి మలేరియా, డెంగ్యూ, యెల్లో ఫీవర్ వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి, ఇవి ప్రాణాంతకం కావచ్చు. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, 2024, ఫిబ్రవరి 10 నాటికి నగరంలో 71,000 దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను PMC గుర్తించింది. నగరంలో వెక్టార్ ద్వారా సంక్రమించే వ్యాధుల కేసుల పెరుగుదలను ఎదుర్కోవడంలో PMC విఫలమైందని నివేదిక పేర్కొంది.
దోమలతో జాగ్రత్త
దోమల వృద్ధిని నియంత్రించడానికి, దోమలు గుడ్లు పెట్టే నీటి నిల్వలను తొలగించడం చాలా ముఖ్యం. ప్రజలు దోమతెరలు, పురుగుమందులు ఉపయోగించడం వంటి నివారణ చర్యలు కూడా తీసుకోవచ్చు. కిటికీలు, తలుపులు మూసి దోమ కాట్ల నుంచి తప్పించుకోవచ్చు. అలానే దోమలు ఎక్కువగా చురుకుగా ఉండే తెల్లవారుజామున, సంధ్యా సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలి.
Recent Comments