epaper
Friday, January 23, 2026

చంద్రబాబు తీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి.. పొత్తుపై ఎఫెక్ట్..!

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఐతే ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన.. టీడీపీ-జనసేన కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి.

మండపేట, అరకు సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఏకపక్షంగా ప్రకటించడాన్ని.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా తప్పుబట్టారు. తాము కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నామని.. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు పవన్ కల్యాణ్. జనసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.

”రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు మిత్ర ధర్మం పాటించాలి. కానీ టీడీపీ దానిని విస్మరించింది. మాతో సంప్రదించకుండా రెండు సీట్లను ప్రకటించింది. లోకేష్‌ సీఎం పదవిపై మాట్లాడినా మౌనంగా ఉన్నా. వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేం రెండు సీట్లు ప్రకటిస్తాం. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుంది. చంద్రబాబుకు ఉన్నట్టే నాకూ ఒత్తిడి ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లను ప్రకటించా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ.. తీసుకునే వాళ్లం కాలేకపోతున్నాం. ఇందుకు పార్టీ నేతలు నన్ను క్షమించాలి. 50, 70 స్థానాలు తీసుకోవాలంటే నాకు తెలియనివికావు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి. కానీ అధికారంలోకి వస్తామో రామో తెలియదు. పవన్‌ జనంలో తిరగడని..వాస్తవాలు తెలియవని..కొందరు విమర్శిస్తున్నారు. అవన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానా? ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం.. విడదీయడం తేలిక. అందుకే నాకు నిర్మించడం ఇష్టం.” అని పవన్ కల్యాణ్ అన్నారు.

అంతేకాదు ..పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు స్పష్టంగా తెలుసని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడో వంతు సీట్లు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంటే 58 సీట్లను జనసేనకు ఇవ్వాల్సిందేనన్నారు జనసేనాని. ఈ పొత్తు అసెంబ్లీ ఎన్నికలతో ఆగిపోకూడదని.. ఎన్నికల తర్వాత కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పవన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబునాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!