ePaper
Thursday, March 12, 2026
📄 ePaper

అల్ ఖోబార్‌లో ఘనంగా ‘ఉమెన్స్ ఫెస్టివల్ ఆఫ్ క్రికెట్ 2026’.. వెల్లువెత్తిన క్రీడాభిమానం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

అల్ ఖోబార్, సౌదీ అరేబియా (జనవరి 30): సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం అల్ ఖోబార్‌లోని స్పోర్ట్స్ సిటీ (స్పోర్ట్స్ యార్డ్) వేదికగా జనవరి 30న ‘ఫెస్టివల్ ఆఫ్ క్రికెట్ – ఉమెన్స్ ఎడిషన్ 2026’ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. గ్లోబల్ ఇండియా సౌదీ అరేబియా (GISA) ఆధ్వర్యంలో, సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ (SACF) సహకారంతో నిర్వహించిన ఈ టోర్నీలో ఏకంగా 23 జట్లు, 255 మంది రిజిస్టర్డ్ మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు. మహిళల క్రికెట్ పట్ల పెరుగుతున్న ఆదరణకు ఈ టోర్నీ అద్దం పట్టింది. ఈ పోటీలను వీక్షించేందుకు మరియు క్రీడాకారిణులను ఉత్సాహపరిచేందుకు సుమారు 2,500 మంది ప్రేక్షకులు తరలివచ్చారు.


విజేతలుగా ‘రాయల్ ఛాలెంజర్స్ దమ్మామ్’
మహిళల విభాగం ఫైనల్‌లో కెప్టెన్ ఆఫ్రీన్ భాను నేతృత్వంలోని ‘రాయల్ ఛాలెంజర్స్ దమ్మామ్’ జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా అవతరించింది. కెప్టెన్ శాంతి చంద్ర సారథ్యంలోని ‘అరేబియన్ ఫాల్కన్స్’ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు 11,111 సౌదీ రియాల్స్, రన్నరప్‌కు 5,555 సౌదీ రియాల్స్ నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలను అందజేశారు. జూబైల్ క్రికెట్ అసోసియేషన్ (JCA) కు చెందిన మాజ్ మునీర్ విజేతలకు చెక్కులను బహూకరించారు. విన్నింగ్ ట్రోఫీని ఈస్ట్ ఎర్టికాజ్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన మోహన్నద్ హద్దాద్ అందజేయగా, రన్నరప్ అవార్డును గల్ఫ్‌టెక్‌కు చెందిన వికాస్ హండా ప్రధానం చేశారు.


పాఠశాలల విభాగంలో జరిగిన పోటీల్లో అల్ ఖోబార్‌లోని అల్ ఖోజామా ఇంటర్నేషనల్ స్కూల్ విజేతగా నిలవగా, డ్యూన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. ఈ అవార్డులను రామ్ క్లినిక్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ షేకర్, గల్ఫ్‌టెక్‌కు చెందిన వికాస్ హండా ప్రధానం చేశారు.
పకడ్బందీ నిర్వహణ.. ఆకట్టుకున్న ముగింపు వేడుకలు
ఈ టోర్నీ ముగింపు వేడుకలకు సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ (SACF) ప్రతినిధి అబ్దుల్ రెహ్మాన్ కె. అల్జోహాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫెస్టివల్ ఆఫ్ క్రికెట్ (FOC) ప్రెసిడెంట్ అనిల్ మల్పానీ, సీఈఓ అలోక్ కనేకర్, సీఓఓ షామ్రోజ్ మోహిద్దీన్ నేతృత్వంలో ఈ క్రీడా పండుగ ఫెడరేషన్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత ప్రొఫెషనల్‌గా సాగింది.


ఈ సందర్భంగా అనిల్ మల్పానీ మాట్లాడుతూ.. “మహిళలు మైదానంలోకి అడుగుపెట్టి, సమాజం వారికి అండగా నిలిచినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుంది” అని అన్నారు. మొత్తం కార్యక్రమాన్ని ఎంసీ సాహిల్ జహీర్ హోస్ట్ చేశారు. ఇదే వేదికపై ICC-SACF CRIIIO గ్రాస్‌రూట్ క్రికెట్ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహించారు. సర్టిఫైడ్ కోచ్ మహ్మద్ అజీముద్దీన్ పర్యవేక్షణలో వందలాది మందికి క్రికెట్ శిక్షణ అందించారు.
కదం తొక్కిన తెలుగు సంఘాలు.. కమ్యూనిటీల మద్దతు
ఈ క్రీడా పండుగకు పలు స్థానిక సంఘాలు విశేష మద్దతు తెలిపాయి. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) తరపున తేజ పల్లెం, ఓం ప్రకాష్ పాల్గొని తమ సంఘీభావాన్ని చాటారు. అలాగే మంగళూరు అసోసియేషన్ సౌదీ అరేబియా (MASA) నుంచి గోపాల్ శెట్టి, రాజస్థాన్ ఫౌండేషన్ సౌదీ అరేబియా చాప్టర్ నుంచి అనిల్ మల్పానీ, అమిత్ కౌంతియా, వివేక్ కేడియా, గల్ఫ్ హైదరాబాద్ అసోసియేషన్ నుంచి మహ్మద్ అబ్దుల్ హక్ హాజరయ్యారు.


టోర్నీ విజయవంతం కావడంలో కోర్ టీమ్ సభ్యులు అరుణ్ దీక్షిత్, విన్సెంట్ సల్దానా, సంజన కనేకర్, బఖ్తవర్ అమీన్, క్రిశాంతి సెంథిల్‌కుమార్, ప్రాజక్త వైద్య, అమెనా ఏకే, మిలింద్ ధికాలే తదితరుల కృషి ఎంతో ఉంది. సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా క్రీడల్లో మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో ఈ టోర్నీ ఒక ఆదర్శంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!