మానవ నాగరికత కుల వృత్తులపై ఆధారపడి ఉండేది. మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతీది కుల వృత్తులతో అవినావ సంబంధం ఏర్పరచుకుని ఉండేది.
ప్రధానంగా కమ్మరి,కుమ్మరి,కంసాలి,వడ్ల,చాకలి,మేర, మంగళి, వీటికి అధిక ప్రాధాన్యత కలిగి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినవి.
కానీ నేడు రెడిమెడ్ దెబ్బకు కుల వృత్తులు కుదేలై తమకు వారసత్వంగా వచ్చిన కులవృత్తులను వదిలి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఇతర పనుల్లో చేరి తమ బ్రతుకుబండి సాగిస్తున్నారు.
నూతన నాగరికత వలన మానవ సంబంధాలు తగ్గి మనిషి సంపాదన కోసం అధిక సమయం కేటాయించడం వలన ఆత్మీయతను కోల్పోతున్నారు.
ఒకప్పుడు గ్రామాలలో కమ్మరి కొలిమి వద్ద, వడ్రంగి వద్ద, వాగుల వద్ద, మంగలి (రజక) వారి వద్ద, కుమ్మరి పని వద్ద ప్రజలు తమ వస్తువుల కోసం వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు.
అక్కడ వారు తమ అవసరాల కోసమే వెళ్ళినా అందరితో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ మంచి చెడు విశ్లే సిస్తు ఆనందంగా ఉండేవారు.
కానీ నేడు పల్లెల్లో అలాంటి దృశ్యాలు కనపడవు.
ఏ కుల వృత్తి వారైనా వారిని కుల వృత్తితో కాకుండా మామ, బావ, చెల్లి, అక్కా, అంటూ పిలుచుకుంటూ సొంత మనుషుల్లా ఉండేవారు.
నాటి కాలంలో మనతో పాటుగా అందరూ బాగుండాలి, అందరం కలిసి ఉండాలని పేద దనిక తేడా ఉండవద్దు ఒక కులం మరో కులంతో చిన్న పెద్ద తేడాలు ఉండొద్దు అనుకునే కావచ్చు. శుభకార్యాలకు, మంచికి, చెడుకు కుల వృత్తుల వారికి పనులు అప్పజెప్పే వారు.
మనిషి పుట్టినపుడు బొడ్డు తాడు తెంచెందుకు, పురుడు పోయడానికి గ్రామాలలో మంగలివారినే పిలిచేవారు అది వారు మాత్రమే చేసేవారు, ఆ తరువాత తొట్లే ( నామకరణం) కార్యక్రమానికి మేర వారు కుట్టిన తెల్లని చొక్కా,డ్రెస్ తప్పనిసరి, పుట్టెంట్రుకలు కార్యక్రమంలోనూ మేర వారిచే కట్టించిన బట్టలు వేసేవరు, మంగలి వారిచే మొదట వెంట్రుకలు తీసేవారు అలా చేసినందుకు వారికి నాడు స్తోమతను బట్టి డబ్బులు, పప్పు దినుసులు ఇచ్చేవారు, పెళ్లి కార్యక్రమానికి కుమ్మరి వారు చేసిన కుండలను వాడుతూ వాటికోసం ఒక ప్రత్యేక కార్యక్రమం చేసేవారు, పెళ్లి తంతులో రజక వారిది ప్రత్యేక పాత్ర, మనిషి చనిపోయిన రోజు చాకలి వారు, మంగలి వారు, వడ్రంగి వారు, కుమ్మరి వారు వీరు చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఉంటుంది. కమ్మరి, వడ్రంగి వాకిట్లో నిత్యం వ్యవసాయ అవసరాల కోసం రైతులతో కిటకిట లడేవి.
కులవృత్తి అనేది నేడు చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడే రోజులు, కానీ నాడు వారికున్న గౌరవం, మర్యాద వేరు.
నాడు దర్జాగా బ్రతికిన దర్జీ నేడు దీన స్థితిలో రోదిస్తున్నారు, వారి చేతిలో కత్తెర సిలుం బట్టి సిలుక్కొయ్యకు ఊగుతున్నది,
రైతులతో కలకల లాడుతు నిప్పు రవ్వలతో ఎర్రగా మండే కమ్మరి కొలిమి లు కానరకుంట ఉన్నవి,
చేతి నైపుణ్యం తో కుమ్మరి చేతితో తిరిగే చట్రం నాలుగు ముక్కలై ఎప్పుడో వంట చెరుకైంది,
ఆసాములతో నిండుగా ఉండే వడ్రంగి వాకిల్లు నేడు కాంక్రీటు రాల్లచే కప్పబడి ఉన్నవి, బడిషెలు, ఉలులు ఇప్పటితరం వారికి తెలియనే తెలియవు.
పండుగకు, పబ్బానికి, జాతరకు, శుభ,అశుభ కార్యాలకు సప్పుడు చేసిన మాదిగ వారి డప్పు డీజే ల ముందు మూగబోయింది.
వాగుల వద్ద తియ్యటి జానపద రాగాలతో బట్టల దెబ్బలే దరువులైన చాకలి రేవులు నేడు కొట్టుకొని పోయినవి.
పల్లెల్లో పనులు లేక పొట్ట కూటి కోసం బొంబాయి, దుబాయి బటపట్టిన వారెందరో ఉన్నారు.
పనుల కోసం పట్నం వెళ్లి పస్తులున్న వారు వేళల్లో ఉన్నారు. వారసత్వంగా వచ్చిన పనిని ఒదులు కోక, తమ కులవృత్తిని బ్రతికించలన్న తపనతో చాలి చాలని డబ్బులతో ఇంకా గ్రామాలలో స్థిరపడ్డ వారు కొందరే.
ఎంతో నైపుణ్యం కలిగిన కులవృత్తులు నేడు అంతరించి పోవడం బాదకలిగించే విషయం.
రెడిమెడ్ దెబ్బకు కుల వృత్తులు కుదేలై, కాలంతో పోటీ పడలేక కనుమరుగవుతున్న కులవృత్తుల కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
ప్రభుత్వాలు కుల వృత్తులపై దృష్టి సారించి వారికి ఆర్థిక తోడ్పాటు నందించి ఆదుకోవాలి.
మనం కూడా ఎప్పుడూ రెడిమెడ్ వాటినే కాకుండా కుల వృత్తుల వారి వద్ద కొనుగోలు చేసి వారిని ఆర్థికంగా ఆదుకుందాం మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన తోటి కులాలను మనతో ఎదగనిద్దం.
మన గ్రామ స్వరాజ్యాన్ని కాపాడుకుందాం.
వ్యాసకర్త –
గాజుల రాకేష్
బీజేపీ సోషల్ మీడియా
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments